రామానాయుడికి అస్వస్థత

 

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు అస్వస్థులుగా వున్నారని వార్తలు వస్తున్నాయి. 78 సంవత్సరాల రామానాయుడు గత కొద్దికాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనను కలసినవారు కూడా ఆయన చాలా సన్నబడ్డారని, ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. ఆరు నెలల క్రితం వరకూ కూడా సినిమా ఫంక్షన్లకు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే ఆయన ఇప్పుడు అసలు బయటకి రావడం లేదు. నడిచే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల ఆయన ఇంట్లోనే ఉండి తన అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకింది. దానికి ఆయన అప్పట్లో చికిత్స తీసుకుని ఆ వ్యాధి మీద గెలిచారు. అయితే వయసు పెరిగిపోవడంతోపాటు ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడటంతో ఆయన మళ్ళీ చికిత్స పొందుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన రామానాయుడు చాలా మంచి మనిషి. జీవితంలో చాలా సాధించారు. ఎంత సాధించినా ఒదిగి వుండటం ఆయన తత్వం. కాలం ఎవరినైనా తీసుకుని వెళ్ళిపోతుంది. రామానాయుడు కూడా కాలం మాయ గురించి బాగా తెలిసిన కర్మయోగి. మనిషి మనమధ్య నుంచి వెళ్ళిపోయాక అందరూ అంత మంచి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి అని పొగుడుతారు. కానీ రామానాయుడు జీవించి వుండగా కూడా మనస్పూర్తిగా పొగడాల్సినంత మంచి వ్యక్తి. రామానాయుడిది చాలా సంతోషకరమైన జీవితం. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి. నలుగురికి సాయపడిన వ్యక్తి. అంత మంచి మనిషి అనారోగ్యంతో బాధపడుతూ వుండటం బాధాకరమే అయినప్పటికీ ఆ బాధను దిగమింగి ఆయన కోలుకోవాలని, మరికొంతకాలం జీవించాలని సినిమా పరిశ్రమలోని వారందరూ కోరుకుంటున్నారు.