రామ్‌ చరణ్‌ తేజ్ విమానం ల్యాండ్ అయింది

 

ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌ చరణ్‌ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌-‘ట్రూజెట్‌’ అనే పేరుతో దేశంలో విమాన సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఆ సంస్థకు చెందిన 72 సీట్ల విమానం నిన్న మలేషియాలోని సుబాంగ్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంది. ట్రూజెట్ విమాన సేవలు జూన్ నెలాఖరులోగా లేదా జూలై మొదటి వారం నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ మొదట కేవలం 8 ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడుపుతుంది. తరువాత క్రమంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తన సేవలను విస్తరింపజేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించనున్న ఈ సంస్థకు వంకాయలపాటి ఉమేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ 2014 లోనే అవసరమయిన అన్ని అనుమతులు ఇచ్చింది. రెండు ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు కూడా అనుమతులు మంజూరు చేయగా వాటిలో మొదటిది నిన్న హైదరాబాద్ చేరుకొంది. త్వరలోనే రెండవ విమానం కూడా హైదరాబాద్ చేరుకోవచ్చునని సమాచారం.

 

దేశంలో అనేక ప్రైవేట్ విమాన సంస్థలున్నాయి. వాటిలో విజయవాడ కేంద్రంగా విమానయాన సర్వీసులను అందిస్తున్న ఎయిర్‌కోస్టా సంస్థ తెలుగువారికి చెందిన మొట్టమొదటి విమాన సంస్థ కాగా, ఇప్పుడు రామ్‌ చరణ్‌కు చెందిన ట్రూజెట్ సంస్థ రెండవది. మెగా ఫ్యామిలీ సభ్యులు అటు రాజకీయాలలో, ఇటు సినిమాలలో కూడా ఉన్నందున, అది ట్రూజెట్ సంస్థకు అదనపు ఆకర్షణ అవుతుంది కనుక ఆ సంస్థకు ప్రజల నుండి మంచి ఆదరణే లభించవచ్చును.