TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హాంకాంగ్ ఓపెన్‌లో సంచలనం: ఒలింపిక్ మాజీ ఛాంపియన్ చెన్ యుఫీని చిత్తు చేసిన రక్షిత రామ్‌రాజ్.!

Published on: Thu Nov 19, 2026 3:47PM

భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 19 ఏళ్ల యువ క్రీడాకారిణి రక్షిత రామ్‌రాజ్  సంచలనం సృష్టించింది.  ప్రతిష్ఠాత్మక హాంకాంగ్ ఓపెన్ 2026 సూపర్ 500 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో, మాజీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా స్టార్ షట్లర్ చెన్ యుఫీపై రక్షిత రామ్ రాజ్  సంచలన విజయం సాధించింది. వరుస గేమ్‌లలో గెలుపొందిన ఆమె, తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ 500 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.   అపార అనుభవం, ఒలింపిక్ ఛాంపియన్ హోదా కలిగిన చెన్ యుఫీతో జరిగిన ఈ పోరులో రక్షిత ఆరంభం నుంచే  ప్రత్యర్థిపై పై చేయి సాధించింది.  

చురుకైన కదలికలు,   ఓవర్‌హెడ్ డిసెప్షన్ షాట్లు, పదునైన అటాకింగ్ స్ట్రోక్స్‌తో చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలోకి నెట్టింది. ప్రత్యర్థికి సులభంగా పాయింట్లు లభించకుండా కట్టుదిట్టంగా ఆడిన రక్షిత, తొలి గేమ్‌ను 21-18 తేడాతో గెలుచుకుంది.    రెండో గేమ్‌లో అనుభవజ్ఞురాలైన చెన్ యుఫీ రక్షిత రామ్ రాజ్ ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించింది.  దీంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. 

రక్షిత రామ్,  చెన్ యుఫీలు ఇరువురూ ప్రతి పాయింట్ కోసం చెమటోడ్చారు.  కీలక దశలో సంయమనం కోల్పోకుండా, ఒత్తిడిని అధిగమించి నిలకడగా రాణించిన  రక్షిత 24-22 తేడాతో రెండో గేమ్‌ను కూడా కైవసం చేసుకుని ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది.   

ఈ టోర్నీ ఆరంభం నుంచే రక్షిత అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన  షట్లర్ మియా బ్లిచ్‌ఫెల్డ్‌ను ఓడించి రక్షిత ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. వరుసగా ఇద్దరు బలమైన అంతర్జాతీయ క్రీడాకారిణులను మట్టికరిపించడం ద్వారా తన సత్తా చాటిన రక్షిత రామ్ రాజ్ టైటిల్ పై కన్నేసింది.  ఈ ఏడాది ఆమె ఇప్పటికే హనోయ్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్‌తో పాటు తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 

ఇది కూడా చదవండి:  హైలో ఓపెన్ విజేత పీవీ సింధు: ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మహిళా షట్లర్.!​

అంతే కాకుండా కొరియా మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరుకుంది. వియత్నాం ఓపెన్‌లో మూడో స్థానం దక్కించుకుని సత్తా చాటింది.    తాజా విజయంతో సూపర్ 500 స్థాయి టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది.   తదుపరి క్వార్టర్ ఫైనల్ పోరులో రక్షిత థాయిలాండ్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి పార్న్‌పావీ చోచువాంగ్‌తో తలపడనుంది. 

ఆ  మ్యాచ్‌లోనూ ఇదే దూకుడు, ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంది.   రానున్న క్వార్టర్ ఫైనల్ పోరుపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చెన్ యుఫీపై సాధించిన స్ఫూర్తిదాయక విజయంతో రక్షిత రామ్‌రాజ్ హాంకాంగ్ ఓపెన్‌లో మరింత ముందుకు సాగుతుందని భారత క్రీడా వర్గాలు ఆశిస్తున్నాయి.   

మీకు నచ్చవచ్చు:   ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు​

24 గంటల్లో 3 మ్యాచ్‌లు.. పీవీ సింధు ఫైర్.!

[Rakshitha Ramraj, Hong Kong Open,Sensation, Defet,   Chen Yufei, Indian Badminton, TeluguOne]