రాజస్థాన్ లో కాంగ్రెస్ జోష్: స్థానిక పోరులో తిరుగులేని ఆధిక్యం.. బీజేపీ కుదేలు.!
Published on: Sat Nov 21, 2026 10:06AM

రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. సాధారణంగా స్థానిక ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఏపీ సహా పలు రాష్ట్రాలలో అదే జరిగింది. జరుగుతోంది. అయితే అందుకు భిన్నంగా రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ట్రెండ్ మేరకు పంచాయతీ సమితి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 3,351 వార్డుల్లో ఆధిక్యంలో నిలవగా, బీజేపీ 1,995 వార్డులతో సరిపెట్టుకుంది. ఆర్ఎల్పీ 459 వార్డుల్లో ఆధిక్యత సాధించింది. జిల్లా పరిషత్ ఎన్నికల లో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జడ్పీ వార్డుల్లో కాంగ్రెస్ 222 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 127వార్డుల్లో మాత్రమే ఆధిక్యత కనబరిచింది. నిస్సందేహంగా ఈ ఫలితాలు అధికార బీజేపీకి షాక్ అనే చెప్పాలి.
రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో సానుకూలత ఉంటుందనే భావనకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది.

కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కీలకమైన ఉత్తరాది రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ పుంజుకోవడం.. పార్టీ హైకమాండ్ లోనూ, శ్రేణుల్లోనూ కూడా కొత్త జోష్ ను నింపుతుందనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల స్థాయిలో ఓటర్ల నాడి కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?
ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్బలంగా పుంజుకుందనడానికి సంకేతంగా చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనడానికి తార్కానంగా చెబుతున్నారు.

పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితుల పాలకమండళ్ల ఏర్పాటుపై స్పష్టత రానుంది. కాగా ఈ ఆధిక్యతతో కాంగ్రెస్ తదుపరి వ్యూహాలపై దృష్టి సారించింది. ఈ ఫలితాలు రాజస్థాన్ లో బీజేపీ ప్రతిష్ఠ మసకబారిందని తేటతెల్లం చేస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
మీకు నచ్చవచ్చు: జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం: 26 జిల్లా పరిషత్ కు కైవసం.!
ఒకే కుటుంబం: ముగ్గురు ప్రజా ప్రతినిథులు.. ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ.!
[Rajasthan local body elections, Congress, BJP Defeat, ZP results, Panchayat trends, TeluguOne]


