రైల్వే చార్జీల పెంపు సమర్ధనీయమేనా?

 

 

 

కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైల్వే చార్జీల పెంపు తప్పదని అందరికీ తెలుసు. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవక మునుపే ఒకేసారి సామాన్య ప్రజలపై ఇంత భారం మోపడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ ఈవిధంగా ప్రజాగ్రహానికి గురికావాలని కోరుకోదు. అందువల్ల ఇటువంటి కటినమయిన నిర్ణయాలను కొన్ని నెలల తరువాత అమలు చేయడం మొదలుపెడుతుంది. కానీ, దేశాన్ని వీలయినంత త్వరగా అభివృద్ధి బాట పట్టించాలని తహతహలాడుతున్న నరేంద్ర మోడీ, సమయం వృధా చేయకుండా అధికారం చేప్పట్టిన కొద్ది రోజులకే చాలా దైర్యంగా రైల్వే చార్జీల పెంపు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ భారం సామాన్య ప్రజల మీదనే ఎక్కువగా పడింది గనుక ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేఖిస్తున్నారు. ప్రజలు రైల్వే చార్జీల పెంపుని తప్పుపట్టడం లేదు. సమాజంలో సంపన్నులకు, సామాన్యులకు ఒకటే బెత్తం ఉపయోగించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అందువల్ల మోడీ ప్రభుత్వం ఇకపై సమాజంలో ధనిక, పేద, మధ్యతరగతి వర్గాలను ఒకేగాట కట్టకుండా తదనుగుణంగా వడ్డిస్తే ఇంత వ్యతిరేఖత ఎదురవక పోవచ్చును.



మోడీ ప్రధానిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలని తహతహలాడుతున్నారు. ఆయన చాలా వేగంగా దృడమయిన నిర్ణయాలు తీసుకొంటున్న సంగతి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.ఈ  రైల్వేల చార్జీల పెంపు కూడా అభివృద్ధి కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టిన తరువాత ఎవరూ అడగక మునుపే మన రాష్ట్రంలో వైజాగ్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం సమాచారం సేకరించేందుకు అధికారులను పంపిచారు. అదేవిధంగా దేశంలో రైల్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, దేశంలో బుల్లెట్ రైళ్ళు లేదా సూపర్ ఫాస్ట్ రైళ్ళను ప్రవేశపెట్టాలని, దేశంలో రైల్వే లైన్లను మరింత విస్తరించాలని మోడీ భావిస్తున్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం 24X7గంటలు నిరంతర విద్యుత్ సరఫరా పధకానికి శ్రీకారం చుట్టి దానికి పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఎంపిక చేసింది.


ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కావాలి. ప్రస్తుతం రైల్వేలు నష్టాలలో లేకపోయినప్పటికీ, వచ్చిన లాభాలు వ్యవస్థను యధాతధంగా నడిపిందుకు మాత్రమే సరిపోతోందని నిపుణుల మాట. రైల్వే చార్జీలను పెంచకుండా యధాతధంగా ఉంచినట్లయితే ఈ అభివృద్ధి కార్యక్రామాలకు నిధులు వేరే మార్గాల ద్వారా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అంటే ప్రజలనుండి వేరే రూపంలో ఆ డబ్బులు వసూలు చేయవలసి ఉంటుందన్న మాట. కానీ నరేంద్ర మోడీ ఆ డొంక తిరుగుడు వ్యవహారం చేయకుండా నేరుగా రైల్వే చార్జీలను పెంచి రైల్వేశాఖకు ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేసారు.


స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియకుండా వారినుండి ఏదో రూపంలో నొప్పి తెలియకుండా పన్నులు పిండుకొంటూనే ఉంది. గానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం రానున్న ఐదేళ్ళ కాలంలో దేశం రూపురేఖలను పూర్తిగా మార్చివేసి, భారత్ ను అభివృద్ధికి చిరునామాగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఒకవేళ మోడీ మాటలకు, చేతలకు పొంతన కనబడకపోతే, వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి కూడా ప్రజల చేతిలో పరాభవం తప్పదు. కానీ మోడీ అటువంటి పరిస్థితి చేజేతులా కల్పించుకొంటారని భావించలేము. కనుకనే మోడీ అధికారం చేప్పట్టిన నెలరోజులయినా గడవక మునుపే కటినమయిన నిర్ణయాలు తీసుకొంటున్నారని భావించవచ్చును. కానీ దేశాభివృద్ధి కోసం సంపన్నులను వదిలిపెట్టి సామాన్యులపైనే భారం మోపకుండా అడుగులు ముందుకు వేస్తే దేశాప్రజలందరూ ఆయన వెంట నడుస్తారు.