మోదీ అంబానీతో కలిసి దోచుకున్నారు.. మేం నిరూపిస్తాం

 

రాఫెల్ డీల్ విషయంలో అనుమానించదగ్గ అంశాలు ఏమి లేవంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనకడుగు వేయట్లేదు. మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు రాఫెల్ డీల్ పై మాట్లాడలేదు. తీర్పు వచ్చిన తర్వాత రక్షణ మంత్రి సీతారామన్‌, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రమే మాట్లాడారు అన్నారు. రాఫెల్ పై కాగ్‌ ఇచ్చిన నివేదిక ఏమిటో ప్రభుత్వం మాకు వివరించాలని కోరారు. అసలు కాగ్‌ రిపోర్ట్‌ ఎక్కడ? కాగ్‌ రిపోర్ట్‌ పీఏసీకి ఇచ్చినట్లు సుప్రీంకోర్టు చెప్పింది. రాఫెల్ ధరల వివరాలు పీఏసీ అధ్యక్షుడితో చర్చించినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకు పీఏసీ అధ్యక్షుడు ఖర్గేకి కాగ్‌ నివేదిక అందలేదు అని తెలిపారు. వేరే పార్లమెంట్‌లో పీఏసీకి సమాంతరంగా మరో పీఏసీ నడుస్తుందేమో. ఆ పార్లమెంట్‌ ఫ్రాన్స్‌దేమో. మోదీజీ తన సొంత పీఏసీని నడిపించగలరు అని ఎద్దేవా చేసారు. కాగ్‌ నివేదికను పీఏసీ ఇప్పటి వరకు చూడలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం చూసింది అని విమర్శించారు. దేశ కాపలాదారుడు చోరీకి పాల్పడ్డారని దేశమంతా చూసింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రధాని మోదీ తన స్నేహితుడు అనిల్‌ అంబానీతో కలిసి దోచుకున్నారు. అది మేం నిరూపిస్తాం అన్నారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసి రాఫెల్ పై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.