రచ్చబండ కాడ సమైక్యరాగం ఆలపిద్దుమా

 

ఇటీవల ముఖ్యమంత్రి కాస్త మంద్ర స్థాయిలో సమైక్యరాగం ఆలపిస్తుండటంతో ఎవరికీ సరిగ్గా వినిపించడం లేదు. పైలిన్ తుఫాను సభలో కూడా ఆయన చాలా మంద్ర స్థాయిలో సమైక్య రాగం ఆలపించి, ప్రజలను కూడా తనతో కోరస్ పాడమని కోరారు. అయితే, ఆయన స్వరంలో వచ్చిన తేడాను దిగ్విజయ్ సింగ్ కూడా బాగానే పసిగట్టారు. అందుకే ఈసారి ఆయన చిన్నచిర్నవ్వుతో సరిపెట్టేసారు.

 

కానీ, త్వరలో తెలంగాణా బిల్లో, దాని నకలో మరొకటో శాసనసభకు వచ్చినప్పుడు, సభలో సభ్యులందరి ముందు పూర్తి స్థాయిలో సమైక్య కచేరీ ఈయవలసి ఉంటుంది గనుక, ఇలా క్యాంప్ కార్యాలయంలో ఒంటరిగా కూర్చొని కూని రాగాలు తీయడం కంటే అలా జనాల మధ్యకెళ్ళి రచ్చబండ మీద కూర్చొని జనాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి భావించడంతో రచ్చబండ కచేరీకి ముహూర్తం ఖరారు అయిపోయింది.

 

వచ్చే నెల 6 నుంచి 24 వరకు, అంటే శాసనసభలో ఫైనల్ కచేరీ మొదలయ్యేవరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఇంకా డేట్స్ ఇవ్వలేదని, త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సీమాంధ్ర మంత్రుల సమైక్య రాగాలాపన వినడానికి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, వికలాంగులకు పించెన్లు మంజూరు చేస్తామని మంత్రిగారు చెప్పారు.

 

ఒకవైపు సీమంద్రాలో రచ్చబండ మీద సమైక్యరాగాలాపన జరుగుతుంటే, అదే సమయంలో తెలంగాణా రచ్చబండ మీద తెలంగాణా సాధన గీతం, అదిగో నవలోకం, ఉందిలే మంచి కాలం ముందు ముందునా  వంటి గీతాలను అక్కడి కాంగ్రెస్ మంత్రులు ఆలపించే అవకాశం ఉంది.

 

కానీ, ఫైనల్ కచేరీలో మాత్రం ఎవరి రాగాలు వారే తీయాలని, ఒకరివి మరొకరు కాపీలు కొట్ట కూడదని, పైరసీకి అసలే తావీయకూదదని అందరూ సమైక్యంగా ముందే డిసైడ్ అయిపోయారు. అందువలన రెండు ప్రాంతాలలో ప్రజలు కాంగ్రెస్ నేతలకి కోరస్ పాడుతారో లేదో ముందే ఆలోచించుకొంటె మళ్ళీ అందరి తాళం తప్పకుండా పాట చక్కగా సాగుతుంది.