'పుష్ప' అంటే పవర్ అనుకుంటివా...

ప్రజలు... నమ్మి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఏం చేయాలి.. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. అదే ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి ప్లస్ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే.. ఏం చేయాలి.. రాష్ట్రానికి ఏం చేసినా.. చేయకపోయినా... కనీసం నియోజకవర్గ ప్రజలకైనా అంతో... ఇంతో... ఎంతో కొంత చేయాలి... చేసి తీరాలి. ఇది కనీస ధర్మం. 

అయితే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాత్రం ఈ కనీస ధర్మాన్ని సైతం విస్మరించారనే టాక్ వినిపిస్తోందీ. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా, గిరిజన శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి ఆమె బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయింది. కానీ ఈ సదరు ప్రజా ప్రతినిధి వల్ల గిరి పుత్రులకు ఏమైనా మంచి జరిగిందా?.. వారి సమస్యలు ఏమైనా పరిష్కరమైయాయా అంటే .. మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్యలు... నేటికి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. 

కురుపాం నియోజకవర్గంలో దాదాపు అన్ని రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. దశాబ్దాలుగా పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం ఇప్పటికీ నోచుకోలేదని... దీంతో 60 కిలోమీటర్ల మేర చుట్టు తిరిగి ప్రయాణించాల్సి వస్తుందంటున్నారు. దాదాపు 30 కొండ ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వీటి కోసం ఎన్నో సార్లు మంత్రి పుష్పకు అర్జీలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని వారు గుర్తు చేస్తున్నారు. ఓ వేళ రహదారులు వేసిన అవి నాసిరకంగా ఉండడంతో అవి కొద్ది రోజులకే కొట్టుకుపోతున్నాయని వారంటున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఉన్నా లేనట్లే అన్న చందంగా తయారైందనీ వారు పేర్కొంటున్నారు.    

ఇక కురుపాం నియోజకవర్గంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయని.. అందుకు మెండింకల్, నీలకంఠపురం, రామభద్రపురంలోని ఆసుపత్రులే ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక చాలా మంది గిరిపుత్రులు ప్రాణాలు విడుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక గర్బిణులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారంటున్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సొంత ఊరు చినమేరంగిలో అయితే మద్యం ఏరులై పారుతోందని.. ఈ గ్రామంలో ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి నాటు సారా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకోవడం నిత్యకృత్యమైపోయిందని.....ఒక్క నెలలోనే మంత్రిగారి స్వగ్రామంలో 70కిపైగా నాటు సారా కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు.  

మరో వైపు గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ భూముల వ్యవహారంలో బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని.. ఇక ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయని.. దీంతో పలు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. అయితే గత మూడేళ్లుగా ఏనుగుల గుంపు దాడితో.. వేలాది ఎకరాలకు పంట నష్టం వాటిల్లుతోందని.. డిప్యూటీ సీఎం పుష్పను ఎన్ని సార్లు కలిసి విన్నవించుకున్న పలితం లేకుండా పోయిందని తెలుస్తోందీ. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఆమె ఎంతో చేయవచ్చునని కురుపాం ప్రజలు పేర్కొంటున్నారు. అయినా మనస్సుంటే మార్గముంటుందీ.. కానీ మంత్రి పుష్ప శ్రీవాణికి మనస్సు లేదా?.. లేక ప్రజలకు మంచి చేయడానికి ఆమెకు మనస్సు రావడం లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. పుష్ప అంటే పవర్ అనుకుంటివా.. కాదు.. పేరుకే డిప్యూటీ సీఎం పుష్ప.. ఆమెకు పవర్ లేదని కురుపాం ప్రజలు పుష్ప సినిమాలో డైలాగ్‌లను సైటైరికల్‌గా పేలుస్తున్నారు.