పీ.ఎఫ్‌ జోలికి ఎందుకు!

 

వేసవిలోనూ చల్లగా ఉండే బెంగళూరు నిన్న ఒక్కసారిగా మండిపడింది. పీ.ఎఫ్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా రోడ్డు మీదకు వచ్చారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి బండారు దత్తాత్రేయ ఆగమేఘాల మీద జోక్యం చేసుకుని కార్మికులకు తగిన పరిష్కారాన్ని చూపడంతో సమస్య సద్దుమణిగిపోయింది. కానీ కార్మికుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి ఒక్కసారిగా తెలిసివచ్చింది. ప్రభుత్వం ప్రావిండెంట్‌ ఫండ్‌ మీదే మాటిమాటికీ ఎందుకు తన దృష్టి పెడుతోందన్నదే ఆసక్తికరమైన విషయం!

 

నిబంధనల ప్రకారం 20మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థల్లో ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు మళ్లిస్తారు. అదే మొత్తంలో యజమాని కూడా భవిష్య నిధికి తన వంతు నిధులను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి పదవీవిరమణ లేదా రాజినామా చేసిన పక్షంలో తన జీతం నుంచి సమకూరిన 12 శాతం, యజమాని అందించిన సొమ్ములోంచి 3.67 వెరసి 15.67 శాతాన్ని, దాని మీద వడ్డీని పొందే అవకాశం ఉంది. పీ.ఎఫ్‌ ఉపసంహరణకు సంబంధించిన తేనెతుట్టుని మొదట ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో కదిపారు. పీ.ఎఫ్‌ సొమ్ముని ఉపసంహరించుకునే సమయంలో 40 శాతం సొమ్ము మీద పన్ను రాయితీ అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకటనను మొదటిసారి విన్న మధ్యతరగతి జీవులు తమకు మరో పన్ను రాయితీ వచ్చిందనుకుని మురిసిపోయారు. ఆ తరువాత కాసేపటికి కానీ వాళ్లకి అర్థం కాలేదు... ఇప్పటి వరకూ అసలు పీ.ఎఫ్‌ సొమ్ముల మీద పన్నులే లేవనీ, ఇక నుంచి అందులోని 60 శాతం మీద పన్ను బాదుడు ఉండబోతోందని! దాంతో ఒక్కసారిగా వేతన జీవుల నుంచి ఒక్కసారిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, రోజుకో వాదన వినిపించడం మొదలుపెట్టింది. పన్ను కేవలం యజమాని భాగమైన నిధి మీదే అని ఓసారి, దీర్ఘకాలిక ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే పన్ను ఉండదని మరోసారి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ మధ్య తరగతి ఆవేశం ముందు ఆర్థికమంత్రి అతిచాతుర్యం పనికిరాలేదు.

 

త్వరలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు మొదటికే మోసాన్ని తెస్తాయని గ్రహించిన కేంద్రం, పూర్వపు స్థితే కొనసాగుతుందంటూ వెనక్కి తగ్గింది. కానీ బడ్జెట్‌ ముగిసిన కొద్దిరోజులకే పీ.ఎఫ్‌ని మరో విధంగా అదుపు చేసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఉద్యోగి రాజినామా చేస్తే, తన వంతు పీ.ఎఫ్‌ను మాత్రమే ఉపసంహరించుకోవచ్చనీ, మిగతా మొత్తం 58 ఏళ్లు వచ్చిన తరువాతే లభిస్తుందనీ నిబంధన విధించింది. అదుగో ఆ నిబంధన మీదే నిన్న బెంగళూరు భగ్గుమంది. బెంగళూరులో సాగుతున్న కార్మికుల నిరసన హింసాత్మకంగా మారడంతో, ఈ నిబంధనను ఆదరాబాదరాగా వెనక్కి తీసుకున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం చీటికీ మాటికీ పీ.ఎఫ్‌ని అదుపుచేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానం ఇప్పుడిక కలగక మానదు. భవిష్య నిధి నిజంగా భవిష్యత్తు కోసం అక్కరకు రావాలనీ, ఉద్యోగి జీవిత చరమాంకంలో అది ఉపయోగపడాలనీ... అందుకే తాము ఇలాంటి చర్యలను తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్ణయాల వెనుక మరో కారణం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం కలుగక మానదు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల మీదా, పేదల సంక్షేమం మీదా, వ్యవసాయం మీదా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ లక్షల కోట్లను సేకరించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రుణాలను సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులేమో ఈ రుణాలను అందించే పరిస్థితుల్లో లేవు. బాండ్ల ద్వారా సేకరించగలిగే సొమ్మూ అంతంత మాత్రంగానే ఉంటుంది.

 

ఇలాంటి సమయంలో పీ.ఎఫ్ నిధులను కనుక నిలువరించగలిగితే లక్షల కోట్లు ప్రభుత్వం వద్దకి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే పీ.ఎఫ్‌ ఉపసంహరణ మీద పన్ను విధించి, ఆ పన్ను నుంచి తప్పించుకోవాలంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టుకోండి అంటూ ఓ రాయి విసిరి చూశారు ఆర్థిక మంత్రి. ఆ మంత్రం పారకపోవడంతో ఉపసంహరణ మీద పరిమితులు విధించారు. తద్వారా పీ.ఎఫ్‌ ఖాతాలో ఉండే సొమ్ము పది లక్షల కోట్లను దాటిపోయే అవకాశం వస్తుంది. ఆ సొమ్ములను ఎలాగూ ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. పైగా ఈ సొమ్ములను స్టాక్‌ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెట్టే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా మంచి లాభాలను సాధించి మరిన్ని సంక్షేమ పథకాలను చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు.

 

ఉన్నవాడి నుంచి కొంత తీసుకుని లేనివాడికి ఇవ్వడం ఓ ధర్మం. కానీ మన ప్రభుత్వాలు సాధారణంగా ఉన్నవాడి జోలికి పోవు. కోట్లకు కోట్లుగా తరాల కొద్దీ పోగైన వారి నిధులను ముట్టుకోవు. ఒకవేళ నల్లధనాన్ని వెలికితీస్తామంటూ వాగ్దానాలు చేసినా, అవన్నీ మాటలకే పరిమితం అవుతూ ఉంటాయి. వాళ్లు చేసిన పన్ను ఎగవేతను కూడా చాలా సగౌరవంగా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే ఉన్నవాడు కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలకు కష్టమని మన నేతలకు తెలుసు. అలాగని లేనివాడికీ పెట్టక తప్పదు. ఓట్ల కోసమో, సంక్షేమ రాజ్యం అన్న పేరు కోసమో వాళ్లకి ఏదో ఓ రూపంలో సాయాన్ని అందిస్తూ ఉంటాయి

 

ప్రభుత్వాలు. పేదల్ని ఉద్ధరించడం అంటే వాళ్లకి తగిన జీవనోపాధి కల్పించడం కాదనీ, వాళ్లని ఎప్పటికప్పుడ ప్రభుత్వాల మీద ఆధారపడేలా చేయడం అని అనాదిగా ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచన. ఇలాంటి సమయాలలో ప్రభుత్వాలకి మిగిలిన ఒకే ఒక్క జీవి మధ్యతరగతి మనిషి. వాళ్ల మీద ఎన్ని పన్నులు వేసినా, ఆ పన్నులను ఎంతగా ముక్కుపిండి వసూలు చేసినా సహించి ఊరుకుంటారే కానీ తిరగబడరన్నది ప్రభుత్వాల నమ్మకం. కానీ సందర్భం వస్తే దేశానికి వెన్నుగా నిలిచే మధ్యతరగతి మనిషి కూడా తిరగబడతాడన్నది చరిత్ర చెబుతోంది. వారిలో ముఖ్యమైన కార్మిక వర్గం కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని గతం హెచ్చరిస్తోంది. ఈ విషయం బహుశా ఈపాటికి కేంద్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నిన్న బెంగళూరులో కనిపించిన నిరసన దేశవ్యాప్తంగా పెల్లుబికే ప్రమాదం ఉంది.