కోదండ రాముడు పార్టీ పెడతాడా?

 

కేసీఆర్ తన తెలంగాణా ఉద్యమాన్ని పక్కన బెట్టి ఎన్నికల హడావుడిలో పడటంతో, ఆయనను ఆయన పార్టీనే నమ్ముకొని బ్రతుకుతున్న తెలంగాణా జేయేసీ కూడా ఇక చేసేదేమీ లేక తానూ కూడా అదే దారిలో పయనించాలని నిశ్చయించుకొంది. ఇక, తెలంగాణా ఉద్యమం పేరిట పుట్ట గొడుగులులాగ పుట్టుకొచ్చిన రకరకాల జేయేసీల నేతలు కూడా రాబోయే ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దపడుతున్నారు.

 

వారిలో ప్రప్రధంగా గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ను పేర్కొనవచ్చును. ఆయన మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకు కాదని తెరాస మరెవరికి టికెట్ ఇచ్చినా ఈసారి కూడా పార్టీ ఓడిపోవడం ఖాయమని చెపుతున్నారు. ఈసారి తానే తెరాస అభ్యర్దిగా బరిలో నిలబడుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ నల్గొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు సీటు అయిన తుంగతుర్తిలో పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు.

 

ఇక 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ రసమయి బాలకృష్ణ ఈ సారి తనకు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కత్తి వెంకట స్వామి (తెలంగాణ లెక్చరర్ల ఫోరం నేత) వరంగల్ నుండి, డా. నర్సయ్య (తెలంగాణ డాక్టర్ల జేఏసీ నేత) భువనగిరి పార్లమెంటు స్థానం నుండి, మల్లేపల్లి లక్ష్మయ్య(తెలంగాణ విద్యావంతుల వేదిక ఛైర్మన్‌) కరీంనగర్ పెదపల్లి నుండి పార్లమెంటుకి ఈసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. వీరిలో చాల మంది స్వంత సర్వేలు చేయించుకొని విజయావకాశాల నివేదికలను కేసీఆర్ కి సమర్పిస్తుండగా, మరి కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ టికెట్ కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.

 

అయితే కేవలం ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న కారణంగా ఎవరికీ పార్టీ టికెట్స్ ఇవ్వలేమని, బలమయిన తమ ప్రత్యర్ధులను ఎదుర్కొని ఎన్నికలలో విజయం సాదించాలంటే అందుకు కొన్నిప్రత్యేక ‘అర్హతలు’ తప్పనిసరి అని కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. వీరందరిలో చాలా మందికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిర్దేశించిన ఆ ‘ఆర్ధిక అర్హత’ లేనందున తమకు ఆయన పార్టీ టికెట్ ఇస్తాడని భ్రమలు విడిచిపెట్టి, ఇంతకాలం తమకి ఒక గుర్తింపు, రాజకీయ అవకాశం కల్పించిన తెలంగాణా జేయేసీని దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాముడ్నినమ్ముకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చేసారు. ఒకవేళ కేసీఆర్ తమకు టికెట్స్ ఇవ్వకపోతే అందరూ కలిసి ఆయన నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి, దాని తరపున ఎన్నికలలో పోటీ చేసి తమ ఎన్నికలల కలలను సాకారం చేసుకొని అసెంబ్లీలో పార్లమెంటులో అడుగుపెట్టాలని వారందరూ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు కోదండరాం కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం.

 

కేవలం తన దయవల్లే కోదండరాంకి, జేఎసీకి ఇంత గొప్ప పేరు వచ్చిందని నలుగురిలో చులకనగా మాట్లాడుతున్న కేసీఆర్ కి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే అందుకు ఇదే తగిన సమయమని ఆయనకు అందరూ గట్టిగా చెపుతుండటంతో, ఆయన కూడా గట్టిగానే ఆలోచిస్తునట్లు తెలుస్తోంది.

 

తెలంగాణాలో తెరాస తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నోటి దురుసు ఉన్న కేసీఆర్ క్రింద పనిచేస్తున్న అనేక మంది విద్యావంతులు, మేధావులు కూడా కోదండరాం వంటి ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడు పార్టీ పెడితే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇక, కేసీఆర్ మరియు తెరాస ప్రభావం బలంగా ఉన్న తెలంగాణా జిల్లాలలో ఓట్లు చీల్చితే తప్ప, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కూడా కోదండరాంని వెనుక నుండి ప్రోత్సాహిస్తోందని సమాచారం. ఆయన రాజకీయ పార్టీ పెడితే, ఆయన పలుకుబడి అభ్యర్ధులను గెలిపించలేకపోయినా, తప్పని సరిగా తెరాసా ఓట్లను చీల్చగలదని ధృడంగా నమ్ముతున్న కాంగ్రెస్ పెద్దలు, వెనుక నుండి ఆయనను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే, కేసీఆర్ ఆయన ఆలోచన కార్యరూపం దాల్చనిస్తారని భావించలేము. ఒకవేళ ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ కి ఏమాత్రం అనుమానం కలిగినా, ముందుగా ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చి ఆయనను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఈ నెలాఖరులోగా తెరాస తన మొదటి అభ్యర్ధుల లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది గనుక, అది విడుదల అయిన తరువాత కోదండరాం కొత్త రాజకీయ పార్టీ పెడతారా లేదా అనే అంశంపై కొంచెం స్పష్టత వస్తుంది.