ప్రధాని అలాగ ఎందుకన్నారు

 

నిన్నవైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఏపీ యన్.జీ.ఓ. నేతలు ప్రధాని మన్మోహన్ సింగును కలిసి రాష్ట్రాన్నివిభజించవద్దని కోరినప్పుడు, ఆయన వారికి ఎటువంటి హామీలు ఈయకపోగా రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని గనుక, ఆ విషయంలో తానేమి చేయలేనని తెలిపారు. అంటోనీ కమిటీకి అదనంగా ప్రభుత్వం త్వరలో మరో కమిటీ వేయబోతున్నట్లు, దానికి సమస్యలన్నీ నివేదించుకోమని ఆయన సలహా ఇచ్చి వారిని సాగనంపారు. ప్రధాని నుండి సానుకూల స్పందన వారు ఆశించనప్పటికీ, తెలంగాణా ఏర్పాటుకి నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్నితాను కూడా అడ్డుకోలేనని ఆయన కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారు కంగు తిన్నారు. అయితే ఎవరినీ నొప్పించే విధంగా మాట్లాడే అలవాటు లేని ప్రధాని ఇంత ఖరాఖండిగా ఎందుకు మాట్లాడారనే ప్రశ్నవారిలో మిగిలిపోయింది.

 

రాష్ట్ర విభజనపై జరిగిన చర్చలు, సమావేశాలు, నిర్ణయాలలో సోనియాగాంధీ అంతా తానై వ్యవహరించడంతో ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే నిర్ణయం జరిగిపోయిందని చెప్పవచ్చును. అందుకే రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఉద్యమ నేతలు అందరూ కూడా ఈ విషయంలో ఆమెతోనే సంప్రదింపులు జరపుతున్నారు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాక, కీలకమయిన ఇటువంటి అనేక నిర్ణయాలలో ప్రధాని ప్రమేయం అంతంత మాత్రమేనన్నది బహిరంగ రహస్యమే.

 

ఈ నేపద్యంలో తెలంగాణా ఏర్పాటుకి సోనియా గాంధీ స్వయంగా ఆసక్తి చూపుతున్నప్పుడు, రాష్ట్ర విభజన వల్ల కలిగే విపరీత పరిణామాల గురించి తన ముందు ఎవరు ఎంత మొరపెట్టుకొన్నపటికీ, ప్రధాని తన నిస్సహాయతను గ్రహించినందున తన ముందున్న ఏకైక మార్గం-కమిటీ వేయడం గురించి వారికి వివరించి సాగనంపడం తప్ప వేరే ఏమి చేయలేరు.

 

ఇక, రాబోయే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగితే రాహుల్ గాంధీ ప్రధాని పదవి చెప్పటేందుకు అనాసక్తి చూపిస్తున్న కారణంగా మళ్ళీ ఆయనకే అవకాశం దక్కవచ్చును. ఒక వేళ రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టినట్లయితే, ప్రణబ్ ముఖర్జీ అనంతరం మన్మోహన్ సింగుకు రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేఖించి కొత్త సమస్యలను సృష్టించుకోవడం కంటే, తన ‘మౌనముని’ ముద్రను కొనసాగిస్తే అన్ని విధాల మంచిదని మన్మోహన్ సింగ్ భావించి ఉండవచ్చును.