మధిరలో ఎక్కువ.. మలక్ పేటలో తక్కువ

 

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 69.1 శాతం పోలింగ్‌ నమోదయినట్లు గత రాత్రి 11.45 గంటల సమయంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో 91.27 శాతం ఓటింగ్‌ నమోదయింది. అత్యల్ప పోలింగ్‌ రాజధాని పరిధిలోని మలక్‌పేటలో జరిగింది. ఇక్కడ కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. 2014 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 90.04 శాతం ఓటింగ్‌ నమోదయింది. ఈసారి దాన్ని మధిర అధిగమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులోనూ 90.88 శాతం పోలింగ్‌ నమోదయింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిన్న పోలింగ్‌ జరిగింది. ఈవీఎంలు మొరాయించటంతో సుమారు 60 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమయింది. రెండు వేలకు పైగా పోలింగ్‌ యంత్రాలను మార్చడంతో ఆ తర్వాత ఓటింగ్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. ఒక్క పోలింగ్‌ కేంద్రంలో కూడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తలేదు.

ఆరు నియోజకవర్గాల్లో 2014లో కంటే 10 శాతానికి మించి తక్కువ ఓటింగ్ నమోదవ్వగా.. ఐదు నియోజకవర్గాల్లో మాత్రం గత ఎన్నికల్లో కంటే 10 శాతానికి పైగా పోలింగ్‌ పెరిగింది. 
పది శాతానికి పైగా పోలింగ్‌ పెరిగిన నియోజకవర్గాలు: ఆదిలాబాద్‌, దేవరకద్ర, నారాయణపేట, వనపర్తి, కరీంనగర్‌ 
పది శాతానికి మించి తగ్గిన నియోజకవర్గాలు: చార్మినార్‌, మంచిర్యాల, కల్వకుర్తి, కోదాడ, ఇల్లెందు, ఇబ్రహీంపట్నం 
పోలింగ్‌ శాతం పెరిగిన నియోజకవర్గాలు: 73 
పోలింగ్‌ శాతం తగ్గిన నియోజకవర్గాలు: 46