ఈనెల 24 నుంచి సభాసమరం.. కేసీఆర్ సర్కారుకు దబిడి దిబిడే..
posted on Sep 16, 2021 6:03PM
ఆర్నెళ్లు ముగుస్తున్నాయి. ఈనెల 25తో సమయం సమాప్తం. ఆలోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం పడిపోతుంది. బడ్జెట్ సమావేశాలు మార్చ్ 26న ముగిశాయి. అప్పట్నుంచి ఆర్నెళ్లలోపు.. అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఇలాంటి రాజ్యాంగ సంక్షోభ పరిస్థితుల్లో తప్పనిసరై తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు ముందుకొచ్చింది కేసీఆర్ సర్కారు. ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సెషన్ హాట్ హాట్‌గా సాగనుంది. మునపటిలా ప్రధాన ప్రతిపక్షం డీలాగా లేదు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంతో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఆ ఫలితం.. అసెంబ్లీలో తప్పకుండా కనబడుతుంది. దళితబంధు బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానిపైనే ప్రధాన చర్చ జరగుతుందని భావిస్తున్నారు. దళిత బంధు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అమలు చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దళితులతో పాటు గిరిజనులకూ ఇవ్వాలనేది ఆ పార్టీ స్టాండ్. అయితే, ప్రస్తుతానికి హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాలకు మాత్రమే దళిత బంధు అమలు చేయనుంది కేసీఆర్ సర్కారు. తెలంగాణలోని దళిత కుటుంబాలన్నిటికీ 10 లక్షల చొప్పున ఇవ్వాలంటే లక్షా 70 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. మరి, ఆ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. వచ్చే నాలుగేళ్లలో దళితులందరికీ దళిత బంధు ఇస్తామనేది సర్కారు మాట. అందరికీ ఒకేసారి ఇవ్వాలనేది కాంగ్రెస్ వాదన. అసెంబ్లీ వేదికగా ఈ వాడి-వేడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు-ఘోరాలు, మౌలిక వసతుల లేమి తదితర అంశాలతో పాటు.. వరి వేస్తే ఉరి.. అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీసే ఛాన్స్ ఉంది.
ఇక ఇద్దరు ఎమ్మెల్యేలే అయినా.. బీజేపీ సైతం సభలో గట్టిగా తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర నిధులతోనే రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్నారని ఆ పార్టీ మొదటినుంచీ ఆరోపిస్తోంది. ఇక ఇటీవల కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని.. కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాషాయం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, పథకాల్లో కేంద్ర వాటాలపై సర్కారును లెక్కలు అడిగి ఇరకాటంలో పెట్టొచ్చు. ఇక, ఎప్పటిలానే ఎంఐఎం సైతం పాతబస్తీ సమస్యలపై గట్టిగానే నిలదీసే అవకాశం లేకపోలేదు.
ఇలా.. ఆర్నెళ్ల తర్వాత వస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్షాన్ని నిలదీసి, ఇరకాటంలో పెట్టేలా.. విపక్షం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు ఎప్పటిలానే అధికార పార్టీ ఎదురుదాడినే నమ్ముకోనుంది. ఈ నెల 24 నుంచి జరగబోయే తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నాయి అన్నిపార్టీలు. అందుకే, ఈసారి సభాసమరం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు.