నేనే చంపేశానని అనంతబాబు అంగీకరించినా.. పోలీసులు ఒప్పుకోవడం లేదు..!

వ్యక్తిగత విషయాలలో అతి జోక్యం కారణంగా నా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను నేనే చంపేశాను మొర్రో అని వైసీపీ అనంతబాబు నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నా పోలీసులు నమ్మడం లేదు. సరికదా ఆయనపై ఎక్కడ లేని సానుభూతీ చూపుతూ ఆయనకు అనుకూలంగా కథలల్లేస్తున్నారు. హత్య కేసు నుంచి అనంతబాబును తప్పించేందుకు నానా తంటాలూ పడుతున్నారు. ఒక వైపు మంత్రి బొత్స సత్యనారాయణ అనంతబాబు విషయంపై మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తనదైన ఉత్తరాది యాసలో యమ సీరియస్ గా చెప్పేశారు. కానీ పార్టీ పరంగా ఆయనపై చర్యలేమిటన్నప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.

దానికి ఇంకా టైముంది. అన్ని అంశాలూ పరిశీలించాలి అంటూ ముక్తాయించేశారు. ఆయన మాటలకు ఎమ్మెల్సీ అనంతబాబును ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలని పోలీసులు అల్లుతున్న కథనాలకూ బేరీజు వేసి చూస్తే అనంతబాబును హత్య కేసు నుంచి తప్పించేందుకు ‘పై స్థాయి’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ వర్గాలలో ఓ చర్చ జరుగుతోంది.

అసలు ఎమ్మెల్సీపై హత్య కేసే లేకుండా చేయడానికి ప్రయత్నించి తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. సంఘటన జరిగిన తరువాత అనంతబాబుపై హతుడి కుటుంబ సభ్యులు స్పష్టమైన ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోస్టు మార్టం నివేదిక రావాలనీ, అంతనబాబు పరారీలో ఉన్నాడనీ అరెస్టు చేయకుండా తాత్సారం చేసి ఎమ్మెల్సీకి హతుడి కుటుంబ సభ్యులను బెదరించో, బతిమాలో వారి నోటితోనే ప్రమాదం అని చెప్పించేందుకు కావలసినంత సమయం ఇచ్చారు. ఆ ప్రయత్నాలను కూడా అనంత బాబు చేశారు. కానీ అవన్నీ విఫలం అవ్వడంతో గత్యంతరం లేక పోలీసులు అనంతబాబుపై కేసు నమోదు చేశారని విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్నారు.  ఇప్పుడు కూడా అనంతబాబుపై ఎక్కడ లేని సానుభూతి ఒలకబోస్తా ఉన్నారు.

 ఆయన ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అంటూ కేసులో సీరియస్ నెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.   రూ. పాతిక వేలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీకి బాకీ ఉన్నాడట. అందుకే ఆయనను తీసుకెళ్లాడట. మధ్యలో వాగ్వాదం జరిగితే ఎమ్మెల్సీ తోసేశాడట. సుబ్రహ్మణ్యం వెళ్లి చువ్వలపై పడటంతో తలకు తీవ్ర గాయమైందట. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడట. ఇదీ పోలీసులు తాజాగ అల్లిన కథనం. శరీరంపై ఇతర గాయాలెందుకయ్యాయంటే.. సుబ్రహ్మణ్యం ప్రమాద వశాత్తూ చువ్వలపై పడి చనిపోవడంతో ఆ కేసు తనమీదకు వస్తుందన్న భయంతో ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నంలో   సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కర్రతో బాదడంతో అయిన గాయాలని పోలీసులు చెబుతున్నారు.  ఇంత చిక్కటి కథ అల్లిన కాకినాడ ఎస్పీ అనంతబాబు ఉద్దేశపూర్వకంగా సుబ్రహ్మణ్యంను హత్య చేయలేదనీ, సుబ్రహ్మణ్యంతో వాగ్వాదం సమయంలో వెనక్కు తోస్తే అతడు యాక్సిడెంటల్ గా ,ఇనుప చువ్వలపై పడి మరణించాడనీ చెబుతున్నారు.  సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.