ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ సీజ్

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది. కాగా తాజాగా ఈ కేసులో ఉన్న ఎస్ఐబీ ప్రభాకరరావు ఫోన్ ను, ల్యాప్ టాప్ ను సీజ్ చేసింది. ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ లో ఉన్న డేటా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కీలకమని సిట్ భావిస్తోంది.

ప్రభాకరరావు ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపారు. వాటి రిపోర్టులు వచ్చిన తరువాత  సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు పెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న సిట్.. వాటి ఆధారంగా  2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు సిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకరరావుకు నోటీసులు పంపింది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన తరువాత ప్రభాకరరావుకు సిట్ మరో సారి నోటీసులు జారీ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. ఇక సిట్ అరెస్టుల పర్వం జోరందు కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.