చమురు ధరలకు బ్రేకులు లేవా! మరో రెండేళ్ల వరకు ఇంతేనా? 

దేశంలో చమురు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీ గంగాపురంలో పది రోజుల క్రితమే సెంచరీ మార్క్ దాటేసింది లీటర్ పెట్రోల్ రేట్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రీమియం లీటర్ పెట్రోల్ రేచు వంద రూపాయలు క్రాస్ చేసింది. ఢిల్లీలోనూ హండ్రెడ్ కు దగ్గరలో ఉంది లీటర్ పెట్రోల్ ధర. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలకు దగ్గరలో ఉంది. ఏపీ, తెలంగాణలో ప్రీమియం పేట్రోల్ లీటర్ ధర రెపో మాపో సెంచరి కొట్టేయనుంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టేందుకు దూసుకువస్తున్నాయి. త్వరలోనే లీటర్ డీజిల్ రేటు కూడా వంద రూపాయలు క్రాస్ కానుంది.

చమురు ధరల పెరుగుదలపై వినియోగదారుల్లో ఆందోళన పెరుగుతుండగా.. కేంద్ర సర్కార్ వర్గాల నుంచి మరో షాకింగ్ వార్త వినిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకు చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయని ఢిల్లీ వర్గాల సమాచారం. దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. చమురు ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా.. కేంద్ర సర్కార్ ను ప్రశ్నించే బలమైన వాయిస్ కనిపించడం లేదు. అందుకే చమురు ధరల కళ్లెనాకి కేంద్రం కూడా ఆసక్తి చూపడం లేదని అనలిస్టులు చెబుతున్నారు. తమపై ఒత్తిడి లేకపోవడంతో... కేంద్ర సర్కార్ కూడా ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తేవడం లేదనే అభిప్రాయమే అన్ని వర్గాల నుంచి వస్తోంది.

పెట్రోల్, డీజిల్ రేట్ల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే ఆయిల్ , పప్పుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఆయిల్ రేట్లు అయితే రోజు రోజుకు దూసుకుపోతున్నాయి. లీటర్ ఆయిల్ రేటు రెండు వందల రూపాయల వరకు పెరగవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పప్పులది కూడా అదే దారి. ఆయిల్ రేట్ల పెరుగుదల ప్రభావం ప్రజా రవాణాపైనా తీవ్రంగా పడింది. దీంతో జర్నీ భారంగా మారుతోంది. చమురు ధరల ప్రభావం తీవ్రంగా ఉండటంతో జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.