కాకా మూడో తరం వారసుడి కాంట్రవర్సీలు!

గడ్డం వంశీకృష్ణ ఎంపీ ఆఫ్ పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్. 35 ఏళ్ల చిన్న వయసులోనే ఎంపీగా గెలిచిన ఆయన కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి పెద్దపల్లి సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం వ్యక్తి.  అదే పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలో వంశీ తండ్రి వివేక్,  పెదనాన్న వినోద్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకా  మనవడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ తనదైన వర్కింగ్ స్టైల్‌తో ప్రస్తుతం సొంత పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆయన అనుచరులు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో,  ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీకి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందడం లేదంట.

ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట గడ్డం వంశీకృష్ణ. ఆ నేపథ్యంలోనే గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం సభలో ప్రోటోకాల్  అంశాన్ని ప్రస్తావించారు. సగానికిపైగా క్యాబినేట్ మంత్రులు,  సీఎం ఉన్న వేదికపైనే వంశీ అసంతృప్తి వెళ్లగక్కినా పరిస్థితిలో  మాత్రం ఇసుమంతైనా మార్పు లేదట. దీంతో అధికారులను ప్రశ్నించడం స్టార్ట్ చేసారట ఆయన. అయినా ఫలితం లేకపోవడంతో రూట్ మార్చారంటున్నారు. గత కొంతకాలంగా తన  నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సొంత టీం  ఫాం చేసుకునే పనిలో పడ్డారంట.  గతంలో వంశీ తండ్రి వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిచయాలను వాడుకుంటూ.. వారితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు పడని వారిని చేరదీసి వారికి అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారంట.

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వంశీపై ఆగ్రహంతో కనిపిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని రగిలిపోతున్నారు.   అందుకే తమ పరిధిలో జరిగే అధికార, అనధికార,  పార్టీ కార్యక్రమాలకు పిలిచామా లేదా అన్నట్టు మొక్కుబడిగా ఆహ్వానిస్తున్నారంట. దీంతో ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందట. అటు పారిశ్రామికంగా కీలకంగా ఉండే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో,  ఇటు ధర్మపురిలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి  లక్ష్మణ్ తో, పెద్దపల్లిలో విజయరమణారావుతో వంశీకృష్ణకు గడ్డం  పొసగడం లేదట.  కేవలం వీరితో ఆగితే సరిపోయేది...  అందరినీ సమన్వయం చేసుకునే మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతోనూ లేటెస్ట్‌గా గిచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారంట.

మంథనిలో పరిణామాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని గడ్డం వంశీ ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.  మొదటి నుంచీ శ్రీధర్ బాబుతో సఖ్యతగానే ఉన్న వంశీ ఫ్యామిలీ ఆల్ ఆఫే సడన్‌గా వ్యతిరేకంగా మారిపోయిందట. వంశీ గెలుపులో మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్ర  పోషించారనే టాక్ ఉంది.  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో వంశీకి 50 వేలకు పైగా లీడ్ వచ్చింది.  వంశీ తండ్రి, పెదనాన్నల నియోజకవర్గాల్లో రెండింటిలో కలిపి వంశీకి వచ్చిన లీడ్ కంటే మంథనిలో వచ్చిన ఆధిక్యమే ఎక్కువ. మరి అలాంటి మంత్రి నియోజకవర్గంలో జోక్యం చేసుకునే ప్రయత్నం వంశీ ఎందుకు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.   

సరస్వతి పుష్కరాల సందర్భంగా సీఎం పాల్గొన్న సభలో వంశీ అనుచరులు ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు. దళిత ఎంపీ లేకుండా కార్యక్రమమా అంటూ నినాదాలు చేసారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపు చేసారు.  కట్‌ చేస్తే...  సీఎం సభలో సొంత పార్టీ వారు నినాదాలు చేయడం ఏంటి? అనే అంశంపై హాట్ హాట్‌‌గా చర్చలు సాగుతున్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం సభ అనగానే వంశీకి పూనకాలు లోడింగ్ అయినట్టు, అయితే ఆయనో, లేదంటే ఆయన అనుచరులతో నిరసనలు వ్యక్తం చేస్తారని అని జోకులేసుకుంటున్నారు బయట పార్టీల వారు. 

వంశీ అనుసరిస్తున్న వ్యవహర శైలి ఇప్పుడు పొలిటికల్‌గా ఆసక్తిని రేపుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. పైగా ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభల్లో ఇలా వ్యవహరించడం ఏంటి? అనేది క్యాడర్‌కు అంతు చిక్కడం లేదట.  అధికార పార్టీలోనే ఉన్న వాళ్లు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ, ఇలా పబ్లిక్‌గా రచ్చ చేయడం వెనక లెక్కలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదంట.  వంశీ అనుసరిస్తున్న వైఖరి వెనక కేవలం ఆవేదన, ఆవేశం మాత్రమే ఉన్నాయా?  ఇంకేమైనా అంతరార్థం ఉందా?  అనే చర్చ  ప్రస్తుతం పెద్దపల్లి కాంగ్రెస్‌లో సాగుతోందట.

త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్తు దక్కుతుందన్న భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఇటీవల పలువురు మంత్రులు, సీనియర్ నేతలు  వివేక్ ఫ్యామిలీ పేరు కాకుండా ప్రేమ్‌సాగర్‌రావు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించడంతో తండ్రీ కొడుకులు రగిలి పోతున్నారంట.  అందుకే జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో ఇలా అలజడి సృష్టించి తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే వంశీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.  మరి వంశీ వైఖరిపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారు? వరుసగా సీఎం పాల్గొన్న సభల్లో రచ్చ చేస్తూన్న కుర్ర ఎంపీని ఎలా దారికి తెస్తారు?  అన్ని  నియోజకవర్గాల్లో ఇలా గ్రూపులను ఎంకరేజ్‌ చేస్తున్న ఆయన తీరును ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu