జేడీ లక్ష్మీ నారాయణకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!!
posted on Jan 31, 2020 9:31AM

జనసేనకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. పవన్ కళ్యాన్ ది నిలకడలేని విధానమని అందువల్లే పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించిన పవన్.. అన్నీ తెలుసుకొని లేఖలో ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. లక్ష్మీ నారాయణ జనసేనకు రాజీనామా చేశారు. తిరిగి సినిమాల్లో నటిస్తున్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ది నిలకడలేని విధానమని అందువల్ల పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ మేరకు గురువారం పవన్ కు లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విదానాలు లేవని తెలుస్తుంది, అందువల్ల తాను పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని లేఖ రాశారు. వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
లక్ష్మీ నారాయణ రాజీనామాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు, సినిమాలకు సంబంధించి రాజీనామా లేఖలో తనను ఉద్దేశించి లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కానని అన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి అన్నారు. వారి కోసం, కుటుంబం కోసం పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరంటూ చెప్పుకొచ్చారు. సినిమాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని లక్ష్మీ నారాయణ తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు. పార్టీకి రాజీనామా చేసినా వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఆయనకు శుభాభినందనలు అని పవన్ ప్రకటించారు.