పవన్ కల్యాణ్ పై ఈసీకి పిర్యాదు

 

జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ముద్దురూ కలిసి గత ఐదేళ్ళుగా ఎంతో శ్రమించి ఓదార్పు యాత్రలు, దీక్షాలు, ధర్నాలు, ఉద్యమాలు చేసి ఇప్పుడు తమ ఆ కష్టాన్ని ఓట్లుగా మలుచుకొనేందుకు సిద్దపడుతుంటే, అకస్మాత్తుగా రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీకి మద్దతు తెలపడమే కాకుండా, వైకాపాను, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడం వారికి చాలా ఆగ్రహం కలిగించడం సహజమే. సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేరుగా జగన్, రాజశేఖర్ రెడ్డిలపై చేస్తున్న పలు ఆరోపణలు, ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉండటంతో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయన విమర్శలను వారు ముగ్గురు బలంగా త్రిప్పికొడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి మాత్రం బ్రేకులు వేయలేకపోయారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నారు.

 

ఇటువంటి తరుణంలో ఆయన నిన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైకాపా డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం టీడీపీ, బీజేపీ కూటమికి వేయాలంటూ’ అన్న మాటలను పట్టుకొని వైకాపా నేతలు ఆయనపై ఈసీకి పిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ డబ్బు తీసుకోమని ఓటర్లను ప్రోత్సహించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, అందువల్ల వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈఓ దేవసేనకు వైకాపా నేతలు నిన్న విజ్ఞప్తి చేసారు.

 

పవన్ కళ్యాణ్ ఆవిధంగా ఓటర్లకు చెప్పడం తప్పే. కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్లకు డబ్బు, మద్యం, వెండిసామాను, చీరలు, క్రికెట్ కిట్స్ వంటివి స్వయంగా పంచి పెడుతూ వారిని ప్రలోభపెడుతూ, ఒక్క పవన్ కళ్యాణ్ ఓటర్లను ప్రలోభాపెడుతున్నాడని పిర్యాదు చేయడం ఇంట్లో మొగుడ్ని చావగొట్టి వీదికెక్కి లబోదిబోమని ఏడ్చినట్లుంది వైకాపా పని. అంతకంటే ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణకు వారు నిర్దిష్టంగా సమాధానం చెప్పుకొని ప్రజలను మెప్పించగలిగి ఉంటే బాగుండేది. కానీ అది సాధ్యం కాదని గ్రహించినందునే తమకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.