నేటితో ఎన్నికల ప్రచారం సమాప్తం

 

ఈరోజుతో సాయంత్రం 4గంటలకి సీమాంద్రాలో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. అందువల్ల అమూల్యమయిన ఈ చివరి కొద్ది గంటలలో వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలలో పర్యటించి ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవాలని అన్ని పార్టీల నేతలు తెల్లవారుజాము నుండే తమ ప్రచారం మొదలు పెట్టేసారు. మార్నింగ్ వాక్కి బయలుదేరినవారిని, కూరగాయలు కొనుకోనేందుకు బజారుకు బయలుదేరుతున్న వారి వెంటపడుతూ తమకే ఓటువేయాలని కొందరు అభ్యర్ధులు బ్రతిమాలడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. నవ్వితే నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనుకొంటూ అభ్యర్ధులు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నారు.

 

ఇక ఈరోజే ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఇంతకాలం సీమాంధ్ర అంతటా ప్రచారంలో పాల్గొన్న ప్రధాన అభ్యర్ధులు అందరూ, తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న విజయమ్మ, హిందూపురం నుండి శాసనసభకు పోటీ చేస్తున్న బాలకృష్ణ తదితరులు ఈరోజు పూర్తిగా తమ నియోజకవర్గాలలో ప్రచారానికే పరిమితం కానున్నారు.

 

ఎల్లుండి అంటే మే 7న 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు జరుగబోయే ఎన్నికలలో మొత్తం 3, 67,62975 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 23 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయబడ్డాయి. అరకు, పాడేరు వంటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలయిన 10 నియోజక వర్గాలలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మిగిలిన 165 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.