గంట క‌ళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం.. మాకూ బీపీ వ‌స్తోందంటూ ప‌రిటాల వార్నింగ్‌..

ప‌రిటాల ఫ్యామిలీ. రాయ‌లసీమ‌లో ప‌రిటాల స‌త్తా ఎంతో తెలుసుగా. ఒక‌ప్పుడు కంటిచూపుతోనే సీమ‌ను శాసించేవారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేసేవారు. అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వీంద్ర చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం. న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం, రాజ‌కీయం.. అన్నిటినీ మిక్స్ చేసి.. సీమ‌లో మొన‌గాడిలా నిలిచారు. ఆయ‌నిప్పుడు లేకున్నా.. ప‌రిటాల బ‌లం, బ‌ల‌గం చెక్కు చెద‌ర‌లేదు. డౌట్ ఉంటే అనంత‌పురం జిల్లాలో ఏ ఒక్క‌రిని అడిగినా చెబుతారు.  

టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. దేవాల‌యంలాంటి టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌లు దాడి చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చేసిన దాడులు స‌రిపోవ‌న్న‌ట్టు.. తాజాగా సీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజ‌య‌వాడ‌లో కాబ‌ట్టి దాడుల‌తో స‌రిపోయింది.. అదే మా సీమ‌లో అయితే ఖూనీలు జ‌రిగేవంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. దీంతో.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడులు, మంత్రుల బూతులు, వైసీపీ రెచ్చ‌గొట్ట‌డంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.