రేవంత్‌రెడ్డి ఇమేజ్ అదుర్స్‌.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ రీసౌండ్‌...

రేవంత్‌రెడ్డి. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు ఓ ప‌వ‌ర్‌. కాంగ్రెస్‌కు ప‌వ‌ర్ బూస్ట‌ర్‌. టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగా మ‌రింత మారుమోగుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లిసినా రేవంత్‌రెడ్డి దూకుడు గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసే ప‌దునైన‌ విమ‌ర్శ‌ల గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇలా, కొంత‌కాలంతా రాష్ట్ర‌మంతా రేవంత్‌రెడ్డి హ‌వా న‌డుస్తోంది. మ‌న‌కు ఇంత వ‌ర‌కే తెలుసు. కానీ, రేవంత్‌రెడ్డి టాపిక్ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కాలేద‌ని.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నాయ‌కుల దృష్టిలోనూ రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తాజా ప‌రిణామంతో స్ప‌ష్ట‌మైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ తెలుసుగా. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు. బీజేపీతో పొత్తుకూ సై అన్నారు. అమ‌రీంద‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు ఇటు పంజాబ్‌లో, అటు కాంగ్రెస్‌లో వాడివేడి ర‌గిలిస్తోంది. బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంపై కాంగ్రెస్ వాదులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లూ చేస్తున్నారు. సెక్క్యూల‌రిజం ఏమందంటూ కుళ్ల‌బొడుస్తున్నారు. ఒళ్లుమండిన అమ‌రీంద‌ర్‌.. రివర్స్ అటాక్‌కు దిగారు. మీ కాంగ్రెస్ నేత‌లేమైనా సెక్యుల‌రిస్టులా? అంటూ సిద్ధూ గ‌తంలో బీజేపీలో లేరా? తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది కాదా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత‌టి కీల‌క‌మైన విమ‌ర్శ‌లోనూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ నోటి నుంచి రేవంత్‌రెడ్డి పేరు రావ‌డ‌మే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది అవునా? కాదా? అనేది పెద్ద‌గా ప్రాధాన్యం లేని విష‌యం. బ‌హుషా విద్యార్థి ద‌శ‌లో రేవంత్‌ ఏబీవీపీలో ఉన్నందుకు కాబోలు ఆయ‌న‌లా అని ఉంటార‌ని అంటున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి గురించి అంత చిన్న డీటైల్ కూడా.. ఆయ‌న‌ స్టూడెంట్ లైఫ్ గురించి కూడా.. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమ‌రీంద‌ర్‌సింగ్‌కు తెలిసి ఉండ‌ట‌మే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి విష‌యంలో ఎంత డీప్ డిస్క‌ష‌న్ జ‌రిగి ఉంటుందో.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద స్థాయి నాయ‌కులంద‌రికీ రేవంత్‌రెడ్డి గురించి ఎంత‌లా అప్‌డేట్ ఉండి ఉంటుందో.. అమ‌రీంద‌ర్‌సింగ్ వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైపోతోంద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని జాతీయ కాంగ్రెస్‌ పూర్తిగా స్ట‌డీ చేశాకే.. పార్టీలో చేరిన వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఆ త‌ర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగు కాబ‌ట్టే.. తెలంగాణ‌లోనే కాదు పంజాబ్‌లోనూ ఆయ‌న పేరు రీసౌండ్ అవుతోంది. అందుకే, రేవంత్‌రెడ్డినా.. మ‌జాకా.. అంటున్నారు అభిమానులు.