మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి?
posted on May 14, 2025 4:35PM

పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది. అయితే ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్ ఉగ్రదాడులతో సంబంధం లేదని బుకాయిస్తూనే వస్తోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందన్న విషయం నిర్ధారణ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్యా కొన్ని రోజుల పాటు అప్రకటిత యుద్ధం కొనసాగింది. ఆ సందర్భంగా కూడా పాకిస్థాన్ కు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు చేతులెత్తేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం బతిమలాడుకుంది. సరే ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకారించాయి.
అయితే ఇక్కడే పాక్ తన కుత్సితబుద్ధిని మరో సారి బయటపడింది. ఉగ్రవాదులతో సంబంధం లేదనీ, ఉగ్రవాదాన్నితాము ప్రోత్సహించడం లేదనీ, తామూ ఉగ్రబాధితులమేననీ బుకాయిస్తూ వస్తున్న పాక్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. పాక్ భూభాగంలోని 9 ఉగ్ర సంస్థలను భారత్ ధ్వంసం చేసిన సందర్భంగా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు పాకిస్థాన్ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అలా పాక్ ప్రకటించిన నష్టపరిహారం అందుకునే వారిలో అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత జైషే అహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజహర్ కూడా ఉన్నాడు. బహావల్పూర్ ప్రాంతంలో భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించారు. వారందరికీ వారసుడు మసూద్ అజహారే. దీంతో పాక్ ప్రభుత్వం ఆయనకు 14 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించబోతున్నది. నిజంగా పాకిస్థాన్ కు ఉగ్ర సంస్థలతో బంధం లేకుంటే, నిజంగా ఆ దేశం కూడా ఉగ్రబాధిత దేశమే అయి ఉంటే.. తమ దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ కు కృతజ్ణతలు చెప్పుకోవాలి.
కానీ పాకిస్థాన్ ఆ పని చేయడం లేదు. పాక్ సైనికాధికారులు మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై ఉగ్రవాదుల శవాలపై వారి దేశ జెండా కప్పి అధికార లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేనా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు భారీగా నష్టపరిహారం ఇస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత, ప్రకటిత ఉగ్రవాది మసూద్ అజార్‌కు ఇలా ప్రభుత్వం నేరుగా నష్టం పరిహారం ఇవ్వనుండటం వివాదాస్పదంగా మారింది. ప్రపంచ దేశాలకు పాక్ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది.