ఆ ఐదు రాష్ట్రాలకే 34 పద్మలు ! అవార్డుల్లోనూ ఓట్ల రాజకీయమేనా?

భారత దేశంలో అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులు. వివిధ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా గణతంత్రం దినోత్సవం ముందు రోజు ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సిన ఈ దేశ అత్యున్నత పురస్కారాలపైనా రాజకీయ ముద్ర పడిందనే ఆరోపణలు ఎప్పటి నుంచే ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. తమకు అనుకూలంగా ఉన్నవారికే పురస్కారాలను అంద చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అందుకే కొందరు విమర్శకులు వీటిని "రాజకీయ పద్మాలు" అని చెబుతుంటారు. తాజాగా   2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపైనా  రాజకీయ దుమారం రేగుతోంది. 
 
2021 సంవత్సరానికి గాను  మొత్తం 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అయితే  పద్మ అవార్డు  గ్రహీతల్లో అత్యధికులు కేవలం 5 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలకు అత్యధికంగా 34 పద్మ అవార్డులు దక్కాయి. తమిళనాడుకు 11 పద్మ అవార్డులు దక్కగా, అస్సోంకు 9, పశ్చిమ బెంగాల్ కు 7, కేరళా కోటాలో 6, పుదుచ్చేరి కోటాలో ఒక పద్మ అవార్డును కేంద్రం ప్రకటించింది.  అంటే మొత్తం ప్రకటించిన పద్మాల్లో  29శాతం పద్మ అవార్డులు ఈ 5 రాష్ట్రాలకే దక్కాయన్న మాట. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు  ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. 

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు  మరణానంతరం తమిళనాడు కోటాలో ప్రకటించారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే తెలుగు ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసమే ఆయనకు తమిళనాడు కోటాలో అవార్డు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. కేరళలోని వేనాడ్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా వేనాడుకే చెందిన ధనంజయ్ దివాకర్ సగ్డో అనే వైద్యుడికి పద్మా అవార్డు దక్కింది. స్వామి వివేకానంద మెడికల్ మిషన్ ను నెలకొల్పి, దీని ద్వారా ట్రైబల్స్ కు 1980 నుంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్న డాక్టర్ ధనంజయ్ కి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్నాయని చెబుతారు.

 ఢిల్లీకి చెందిన ఆర్కియాలజిస్టు బీ.బీ.లాల్‌కు ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. బాబ్రీ మసీదు వద్ద జరిపిన తవ్వకాల్లో దేవాలయానికి సంబంధించిన అవశేషాలు కనుగొన్నట్టు లాల్ 1992లో ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఈయనకు పద్మ అవార్డు దక్కలేదు. వామపక్ష సిద్ధాంతాలను అనుసరించేవారికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిందని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శించారు. తాజాగా ఈయనకు పద్మ అవార్డు దక్కటంతో.. రైట్ వింగ్ సిద్ధాంతాలపై విశ్వాసమున్న లాల్‌కు పురస్కారం దక్కిందంటూ విమర్శలు మొదలయ్యాయి. 

పద్మ అవార్డుల ఎంపికలో  రాజకీయ కోణాలు ఉండటం అనేది దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాల విధానంగా మారుతోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఈ పద్మ పురస్కారాలను ఎక్కువగా ప్రకటించటం  వస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోడీ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  పద్మ అవార్డుల జాబితా తమను నిరాశకు గురిచేసిందని, ఎన్నికలున్న రాష్ట్రాలకే అగ్రతాంబూలం ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. అయితే ఈ ఆరోపణలకు కేంద్రం ఖండించింది. ఐతే ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా అత్యధికంగా ఉండటంతో ఎక్కువ అవార్డులు దక్కాయని... విపక్షాలు దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారంటూ కమలనాథులు కౌంటరిస్తున్నారు.