అమెరికన్ పెళ్లికి ఇండియన్ గోల!

 

ఆస్కార్స్... ఈ పదం సంవత్సరానికి ఒకసారి ఇండియాని, ఇండియన్స్ ని ఉర్రూతలూగిస్తుంటుంది! మన సెలబ్రిటీలు తెలిసినంత మాట్లాడేస్తారు!  మీడియా అంతా తెలుసన్నట్టు చెప్పేస్తుంది! అసలు ఆస్కార్స్ జరిగే అమెరికాలో ఇంత హంగామా వుందా అని అనుమానం కలిగేలా గోల మొదలైపోతుంది! కాని, ఇదంతా నాణానికి ఒకవైపు. ఆస్కార్స్ పట్ల భారతీయులు చూపే క్రేజ్ వెనుక చాలా లోతైన భావజాలం వుంది. తెల్లవాళ్ల నుంచీ మనం ఇంకా సాంస్కృతిక స్వాతంత్ర్యం పొందలేదనే దానికి అదో గొప్ప సంకేతం!

 

ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఆస్కార్స్ ఆసాంతం అయిపోయాయి. ఏఏ సినిమాలు నామినేషన్స్ పొందవచ్చు అన్న అంశం మొదలు ఏవి ఫైనల్ లిస్ట్ కి చేరుకున్నాయి, అవార్డ్ సెర్మనీ ఎలా జరిగింది, ఎవరొచ్చారు, ఏమన్నారు వగైరా వగైరా అన్నీ మీడియా అందించేసింది. గంటల తరబడి కవరేజ్ దక్కింది. కాని, అసలు విషయం ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ఆస్కార్స్ అంటే అంతర్జాతీయ అవార్డులు కావు. కనీసం అమెరికాలో అమెరికన్ ప్రభుత్వం ఇచ్చే అధికారిక అవార్డులు కూడా కావు. అక్కడున్న ఒక ప్రైవేట్ అకాడమీ ప్రకటించే ప్రతిష్ఠాత్మక అవార్డులు. పైగా అవ్వి ఒక్కటి అరా విభాగాల్లో తప్ప అమెరికా బయట రూపొందిన చిత్రాలకు ఇవ్వరు. అన్ని సెగ్మెంట్లలో హాలీవుడ్ ఇండస్ట్రీలో తయారైన సినిమాలే అనుమతిస్తారు. అంటే ఆస్కార్స్ కి ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెరకెక్కే వేలాది సృజనాత్మక చిత్రాలకి ఎలాంటి సంబంధం లేదన్నమాట! నిజంగా దేశదేశాల్లో హాలీవుడ్ సినిమాల కన్నా బెటర్ సినిమాలు ఎవరన్నా రూపొందించినా ఆస్కార్స్ లో పట్టించుకోరు.

 

పట్టించుకునే ఉద్దేశం, బాధ్యత కూడా వారికి లేదు! బాలీవుడ్ సినిమాల్ని సత్కరించటానికి ఫిల్మ్ ఫేర్ ఎలాగో... అమెరికన్ సినిమాల్ని ఎంకరేజ్ చేయటానికి ఈ అకాడమీ అవార్డ్స్ కూడా అంతే! కాని, మన దేశంలో, మన దేశం లాంటి మరిన్ని మూడో ప్రపంచ దేశాల్లో ఆస్కార్స్ అంటే వేలం వెర్రి! ఎప్పుడో దక్కే చిన్నా చితక ఆవార్డుల కోసం, రెహమాన్ లాంటి ఆస్కార్స్ విన్నర్స్ కోసం సంవత్సరాల తరబడి నాన్ అమెరికన్స్ తహతహలాడిపోతుంటారు! ఇండియాతో సహా చాలా దేశాల్లో సినీ సెలబ్రిటీస్ కి ఆస్కార్ ఒక స్వప్నం! ఆశయం! ఆరాటం! కాని, హాలీవుడ్ లో పని చేయని వారు ఎంత గొప్ప సినిమా తీసినా అది దక్కే అవకాశం వుండదన్నది పచ్చి నిజం!

 

ప్రపంచం మొత్తం అమెరికా అంటే ఎలాంటి క్రేజో.. అమెరికన్ సినిమాలన్నా అంతే క్రేజ్! అందుకే, హాలీవుడ్ వాళ్లు తమకు తాము చేసుకునే అంతర్గత ఆస్కార్స్ సంబరంలో ఇతర దేశాల మీడియాలు, ప్రముఖులు వేలు పెడుతుంటారు. తమ దేశాల్లో ఆస్కార్స్ స్థాయి అవార్డ్స్ సంబరం ఏర్పాటు చేసుకోకుండా అమెరికాలో జరిగే పేరంటానికి పిలవకున్నా వెళ్లిపోతుంటారు. పైగా అదే గొప్పదన్నట్టు, అక్కడ అవార్డ్ రావటంతోనే జన్మధన్యం అన్నట్టు సామాన్య జనాన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ కారణంగానే కాస్త చదువుకున్న ఇండియన్స్ చాలా మంది ఆస్కార్స్ గురించి గంటల తరబడి చర్చించుకుని మురిసిపోతుంటారు! భారత ప్రభుత్వం మన సినిమాలకిచ్చే అధికారిక అవార్డ్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు కూడా ఆస్కార్స్ గురించి ఆరాటపడిపోతుంటారు! దీని వల్ల అమాంతం జరిగిపోయే నష్టమేం వుండకపోవచ్చు. కాని, ఇలా మరో దేశపు అంతర్గత అవార్డుల పండగని నోరెళ్ల బెట్టి చూస్తూ వుంటే మన స్వంత సినిమా ఏనాటికీ ఎదగదు. మహా అయితే హాలీవుడ్ సినిమాల్ని కాపీ చేస్తూ, ఇమిటేట్ చేస్తూ తృప్తి పొందాల్సిందే తప్ప మనకంటూ ప్రత్యేకత ఏనాటికీ రాదు. అందుకోసమన్నా భారతీయులు ఆస్కార్స్ పిచ్చి తగ్గించుకోవాలి.

 

మనకు ఆస్కార్స్ రేంజ్లో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ సెరిమనీ ఎందుకు లేదో ఆలోచించుకోవాలి. ఏం చేస్తే హిందీతో పాటూ అనేక భారతీయ భాషల్లో రూపొందే వందలాది చిత్రాలు ఘనంగా సత్కరించుకోవచ్చో గ్రహించాలి. అప్పుడు అమెరికన్స్ కు ఆస్కార్స్ వున్నట్టే మనకూ మన స్వంత ఆస్కార్స్ లభించే ఆస్కారం వుంటుంది! ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే... అమెరికాకు నాసా వుంటే మనం ఇస్రో ఏర్పాటు చేసుకున్నాం. అలాంటిది ఆస్కార్స్ తో సరితూగే ఒక ప్రైవేట్ ఫంక్షన్ ప్రతీ యేటా చేసుకోలేమా? కాకపోతే, మీడియా, మేధావులు ఆస్కార్స్ లో ప్రియాంక ఏం డ్రస్ వేసుకుంది లాంటి డిస్కషన్ కాక మరింత ఉపయోగకరమైన చర్చ చేస్తే అన్నీ సాధ్యమే!