ఓసీటీఎల్ కంపెనీ.. ఛలో ఏపీ..

 

కామినేని గ్రూప్‌కి చెందిన ఓసీటీఎల్ (ఆయిల్ కంట్రీ ట్యూబులార్ లిమిటెడ్) మెల్లగా తెలంగాణ రాష్ట్రం నుంచి దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ప్రాంతానికి వెళ్ళిపోయే ఆలోచనలో వుంది. ఈ సంస్థ డ్రిల్లింగ్ పైపుల తయారీలో వుంది. ప్రస్తుతం ఈ కర్మాగారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర వుంది. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే ఐదు రకాల పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆయిల్ సంస్థలతో ఈ కర్మాగారం అనుబంధాన్ని కలిగి వుంది. ఈ కర్మాగారంలో మొత్తం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తాము తమ కర్మాగారాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించక తప్పని పరిస్థితులు ఏర్పాడ్డాయని కామినేని గ్రూప్ డైరెక్టర్ కామినేని శశిధర్ చెప్పారు. ఈ కర్మాగారాన్ని తరలించాలని ఆలోచించడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వెల్లడించారు.

 

ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంఘాలన్నీ ఇటీవల ఒక్కటయ్యాయి. అందరూ కలసి నిరంతరం మూకుమ్మడిగా సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెల కారణంగా సంస్థ నష్టాలబాటలో నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సంస్థ యాజమాన్యం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభో అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ఈ కర్మాగారాన్ని ఏపీకి తరలించాలని అనుకుంటున్నామని శశిధర్ తెలిపారు. ఓసీటీఎల్ కర్మాగారం తయారు చేసే ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు నుంచే ఎగుమతి చేస్తారు. అలాంటప్పుడు ఎంచక్కా కృష్ణపట్నం దగ్గరే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గడంతోపాటు కార్మికుల సమస్యలు కూడా తీరిపోతాయన్న ఆలోచనలో కంపెనీ యాజమాన్యం వున్నట్టు తెలుస్తోంది. కృష్ణపట్నంతోపాటు విశాఖ, కాకినాడ పోర్టుల సమీపానికి కంపెనీలను తరలించే అవకాశాలున్నట్టు సమాచారం.

 

కామినేని గ్రూప్‌కి నార్కట్‌పల్లి దగ్గరే ఓసీటీఎల్ కంపెనీ మాత్రమే కాకుండా కామినేని స్టీల్ అండ్ పవర్, యునైటెడ్ సీమ్‌లెస్ ట్యూబులర్ అనే రెండు కంపెనీలు కూడా వున్నాయి. ఈ కంపెనీలను ఈ గ్రూపు 2,500 కోట్ల రూపాయల వ్యయంతో స్థాపించింది. కొద్ది మాసాల క్రితం ఈ కంపెనీలన్నిటినీ మరో మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించాలని కామినేని గ్రూపు భావించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో విస్తరించడం మాట అటు ఉంచి, అన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించడానికి రెండు వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కర్మాగారాల్లో ఇప్పుడున్న మెషినరీలో 75 శాతం తిరిగి ఉపయోగపడతాయి. అందువల్ల రెండు వందల కోట్లు పోతేపోయాయి.. ఏపీకి వెళ్ళిపోయి మనశ్శాంతిగా కంపెనీలను నడుపకోవాలని కామినేని గ్రూప్ ముఖ్యులు భావిస్తున్నట్టు సమాచారం.