ఏకమైన 13 ప్రతిపక్ష పార్టీలు..

 

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఈ వ్యవహారంపై తప్ప మరే విషయంపై చర్చ జరపడానికి ప్రతిపక్షాలు ఒప్పుకోవడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాల్సిందే.. ఈ విషయంపై మాట్లాడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఉభయసభల్లో అదే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు 13 ప్రతిపక్ష పార్టీలు, ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు నిర్ణయించాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ..ప్రజల ఇబ్బందులను తక్షణం తొలగించాలని తాము కోరుతుంటే, ప్రభుత్వం ఎంత మాత్రమూ స్పందించడం లేదని అందుకే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. నేటి మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనున్నామని, ఆపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు తెలియజేస్తామని మమత పేర్కొన్నారు.