ఉత్తర కొరియా ప్రపంచయుద్ధానికి దారి తీయబోతోందా..?

 

ప్రపంచమంతటిదీ ఒక దారి అయితే, ఉత్తర కొరియాది మరో దారి. అమెరికాను ప్రపంచపటం నుంచి తొలగించడమే ఈ దేశపు లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడమని పబ్లిగ్గానే చాలా సార్లు ప్రకటించింది కూడా. దానికి తగ్గట్టుగానే, గత కొన్నేళ్లుగా, తన మిలిటరీని బలోపేతం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. గత నెలలో ఆటంబాంబ్ కంటే ఎన్నో రెట్లు బలమైన హైడ్రోజన్ బాంబ్ ను భూగర్భంలో టెస్ట్ చేసిన నార్త్ కొరియా, ఈ రోజు ఉదయం సమాచార వ్యవస్థకు సంబంధించిన రాకెట్ ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్యసమితి అనుమతి లేని ఈ ప్రయోగం గురించి కనీసం తన మిత్ర దేశాలకు కూడా సమాచారం ఇవ్వకుండా, ఈ రోదసి ప్రయోగాన్ని నిర్వహించింది నార్త్ కొరియా. దీంతో సౌత్ కొరియా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ రెండు దేశాలూ బద్ధ శత్రువులన్న సంగతి తెలిసిందే..

కొరియా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు, టాంగ్ చాంగ్ రీలాంఛ్ స్టేషన్ నుంచి రాకెట్ ను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది ఉత్తర కొరియా. ప్రస్తుతం ఈ విషయమై ప్రపంచదేశాలన్నీ నార్త్ కొరియా పై ఆగ్రహంతో ఉన్నాయి. అన్ని దేశాలూ, ముక్త కంఠంతో ఆ దేశపు ప్రయోగాల్ని ఖండించాయి. ఈ ప్రయోగం కేవలం తమ ఇన్ఫర్ మేషన్ సిస్టమ్ ను డెవలప్ చేసుకోవడానికి మాత్రమే అని నార్త్ కొరియా చెబుతున్నా, దీని వెనుక మిలిటరీ ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమవుతోందంటోంది అమెరికా. ఇప్పటికే అగ్రదేశం చాలా సార్లు నార్త్ ను హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మరో ప్రపంచయుద్ధం మొదలవడానికి ఎంతో కాలం పట్టదు. అదే జరిగితే, తప్పు ఎవరిదైనా మూల్యం మాత్రం యావత్ప్రపంచం చెల్లించాల్సి వస్తుంది.