‘ఫాస్ట్’ పథకం లేదు... సీఎం కేసీఆర్

 

తెలంగాణ ప్రాంతంలో 1956వ సంవత్సరానికి ముందు స్థిరపడిన వారికే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన పథకం ‘ఫాస్ట్’ ఇక వుండదు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ పథకం విషయంలో హైకోర్టు అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం  మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఇక ఫాస్ట్ పథకం వుండదని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థుల ఫీజు బకాయిలను గత ప్రభుత్వాలు తమ నెత్తిన పెట్టాయని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ఫీజు బకాయిల కింద 862 కోట్ల రూపాయల విడుదలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 125 నుంచి 150 గజాల వరకు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.