బాబు అంటే కోపం లేదు: పురంద్రేశ్వరి

 

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటే తనకు వ్యక్తిగతంగా కోపమేమీ లేదని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంద్రేశ్వరి అన్నారు. దగ్గుబాటి కుటుంబం నారా కుటుంబానికి మొదటి నుంచీ దూరంగా వుంటూ వచ్చంది. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసిన సమయంలో తోడల్లుళ్ళు చంద్రబాబు, వెంకటేశ్వరరావు దగ్గరైనప్పటికీ ఆ తర్వాత వెంకటేశ్వరరావు చంద్రబాబుకి దూరమయ్యారు. ఆ తర్వాత రెండు కుటుంబాలూ దూరంగానే వుంటూ వచ్చాయి.

 

దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయంగా కూడా చంద్రబాబుతో వైరం వుండేది. అయితే ఇటీవలి కాలంలో  మారిన రాజకీయ సమీకరణాలతో ఈ రెండు కుటుంబాలు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార కార్యదర్శిగా వున్న పురంద్రేశ్వరి తెలుగుదేశం నాయకులతో, చంద్రబాబుతో సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పాత పగలను కడుపులో పెట్టుకుంటే అది రెండు పార్టీలకు మంచిది కాదు.



ఇలాంటి సందేహాలు జనంలో వస్తాయనే ఊహించిన చిన్నమ్మ శనివారం నాడు వివరణ ఇచ్చంది. తనకు చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా వైరమేమీ లేదని స్పష్టం చేసింది. ఆనాటి సంక్షోభ సమయంలో తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం వాటిని తాను పట్టించుకోవడం లేదని ఆమె చెప్పింది. చిన్నమ్మ చెప్పిన చల్లటి మాట తెలుగుదేశం వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.