కేసీఆర్ మారడు.. మరోసారి క్లారిటీ వచ్చింది!

పుట్టుకతో వచ్చిన బుద్ధి... అంటారు చూశారా.. ఆ మాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సరిగ్గా సూటవుతుంది. పదేళ్ళపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా అహంకారపూరితమైన అధికారాన్ని చెలాయించిన కేసీఆర్‌ని, ఆయన పార్టీని నిన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకుంటే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌కి మళ్ళీ ప్రజాదరణ లభిస్తే లభించవచ్చు. కానీ, కేసీఆర్‌గానీ, ఆయన పార్టీలోని వ్యక్తులుగానీ తమ పాత ధోరణిలోనే వున్నారు తప్ప మారే ధోరణిలో ఎంతమాత్రం లేరు. ఈ విషయం కేసీఆర్ తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తూ అర్థమవుతోంది. తమను ఇంటికి పంపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్ అంటున్నారంటే, ఇంతకంటే అమాయకత్వం, అహంకారం మరొకటి వుంటుందా?
1989లో ఎన్టీఆర్‌ని కూడా ప్రజలు ఓడించారు. తనకు తిరుగేలేదని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాకయ్యారు. అయినప్పటికీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనను తాను మార్చుకున్నారు. అంతే తప్ప ప్రజలను ఏనాడూ నిందించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ ఎన్టీఆర్ నుంచి ఈ గుణాన్ని నేర్చుకోలేదు.
పదేళ్ళ కేసీఆర్ అధికారాన్ని పీకి అవతల పారేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్‌కి అంగుష్టమాత్రుడిగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించినట్టే భావిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పవనే భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం చాలా చిన్న విషయంగానే భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తాను చాలా గొప్ప పరిపాలన అందించినట్టే ఆయన భావిస్తున్నారు. 
బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబానికి విధేయంగా పడివుండేవారు తప్ప మరెవరూ ఆ పార్టీలో వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితులకు భిన్నమైన విధంగా కేసీఆర్ వాదన వుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నాయకులు తనకు ఫోన్ చేసి, అనవసరంగా బీఆర్ఎస్‌ని వదిలి వెళ్ళామని బాధపడుతున్నారట. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్‌కి ఫోన్ చేసే సీన్ లేదు.. ఇప్పుడు బయటకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయడం, ఈయన మాట్లాడ్డం... బాగుందండి కల్పన. కేసీఆర్ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో వున్నారట. వాళ్ళంతా బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తున్నారట, కాంగ్రెస్ నుంచి 
బయటకి వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.