ఇన్ చార్జి డీజీపీపై ఎన్నికల సంఘం వేటు.. ఇంత ఆలస్యంగానా?

ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ  వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.  

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవథిలో బెంగాల్ డీజీపీపై వేటు వేసిన ఎన్నికల సంఘం, ఏపీలో ఇన్ చార్జ్ డీజీపీని మార్చడంలో చేసిన తాత్సారం విమర్శలకు తావిస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఇక చివరి క్షణంలో ఇక తప్పని సరి పరిస్థితుల్లో, అదీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై అధకార పార్టీ మూకలు దాడి చేసిన తర్వాత బదలీ వేటు వేసింది.  కానీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెలన్నర వ్యవధిలో సీఎం రేమేష్ పై దాడికి   ముందు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలూ, దాడులను ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది.

వాస్తవానికి ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి.  ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా  ట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి ఆయన ఇన్ చార్జ్ డీజీపీయే.  ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలుగుదేశం  ఆరోపణలు చేసింది. వీటి వేటికీ స్పందించని ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగే సరికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గుర్తించింది. మరీ ముఖ్యంగా సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక రోజు ముందు ఇన్ చార్జి డీజీపీపై వేటు వేసింది.

ఇప్పుడు ఇక వారం రోజులలో ఎన్నికలు జరగనుండగా కొత్తగా వచ్చే డీజీపీ పోలీసుల పని తీరును సమూలంగా మార్చేందుకు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా పోలీసుల పనితరులో మార్పు వచ్చి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చక్కబడుతుందేమో చూడాలి.