ఏపీలో ఉపఎన్నికలు లేవు.. ప్లాన్ ప్రకారమే జరిగిందా?

 

ఓ వైపు తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం మరోవైపు ఏపీలో ఉప ఎన్నికలు లేవని స్పష్టం చేసింది. కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. అయితే ఈ రాజీనామాలు నిజాయితీతో చేసినవి కావని అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ఆ రాజీనామాలకు లేటుగా ఆమోదం వచ్చిందని విమర్శలు తలెత్తాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏడాది కన్నా తక్కువ గడువు ఉంటే ఉపఎన్నికలు నిర్వహించరు. ఈ లాజిక్ ని రాజీనామాలు, ఆమోదంలో ఉపయోగించారని పలువురు అభిప్రాయపడ్డారు. తరువాత ఈ టాపిక్ సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పుణ్యమా అని ఈ టాపిక్ మళ్ళీ తెరమీదకు వచ్చింది.

తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సీఈసీ ఓపీ రావత్ ఏపీలో ఉప ఎన్నికలు లేవని తేల్చిచెప్పారు. ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ.. ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించడం జరిగిందన్నారు. జూన్ 3వ తేదీతో లోక్‌సభ గడువు ముగుస్తుందని, ఎన్నికల నిర్వహణకు ఏడాది కంటే తక్కువగానే గడువు ఉన్నందున ఉప ఎన్నికలు ఉండవని రావత్ ప్రకటించారు.