నాకేంటి ... మాకేంటి ..

కాంగ్రెస్’లో కొత్త పంచాయతి!

నిజమే..  హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయ కులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి,  గోల ఉండదా  అంటే..  అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు.  ప్రస్తుతం  తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి?  అన్న దగ్గరే మొదలైంది, దాని  చుట్టూనే తిరుగుతోంది. అలాగే..  పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ.. అక్కడి మాజీ అధికార పార్టీ వైసీపీలో, పెద్దాయన  (వైఎస్సార్) ఫామిలీలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో  చూస్తూనే ఉన్నాం.  దోచుకున్న సొమ్ముల పంపకాల్లో వచ్చిన పేచీలు  పార్టీని, ఫ్యామిలీని నిట్ట నిలువునా చీల్చివేసాయి. 

అయితే..  ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ సందడి కొంచెం ఎక్కువగా వినిపిస్తోంది. హస్తం పార్టీలో  అసంతృప్తికి సంబందించిన వార్తలు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో  జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక నాయకులను, క్యాడర్ ను సిద్దం చేసేందుకు  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ జిల్లాల వారీగా నిరహిస్తున్న సమావేశాల్లో అసంతృప్తి అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల మొదలు జిల్లా నాయకుల వరకూ పార్టీ అధికారంలో ఉన్నా పనులు  కావడం లేదనీ..  ఎంతో  కాలంగా అణచి పెట్టుకున్న అసంతృప్తిని మీనాక్షి మేడంకు విన్నవించు కుంటున్నారని అంటున్నారు.  

ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న  మీనాక్షి నటరాజన్  పార్టీని క్రింది స్థాయి నుంచి ఆక్టివేట్ చేసే ఉద్దేశంతో  స్వయంగా రంగంలోకి దిగి,  జిల్లాల వారీగా   సమావేశాలు నిర్వహి స్తుంటే.. మరో వంక ఇదే అవకాశంగా తీసుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలు  ప్రభుత్వంలో తమకు  రావలసిన వాటా  రావడం లేదని అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే  అసంతృప్తి నేతలు, క్యాడర్ లో వ్యక్తమవు తోందని అంటున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నపదేళ్ళ కాలంలో  నాయకులు పట్టించుకున్నాపట్టించుకోక పోయినా.. పార్టీకోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలు  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తమకు  మొండి ‘చేయి’ చూపిస్తోందని అంటున్నారు.  నిజానికి, ఇంతలా గుప్పుమనక పోయినా.. జిల్లాల్లో  జిల్లా స్థాయి నాయకుల మొదలు సామాన్య కార్యకర్తల వరకు ఎప్పటినుంచో అసంతృప్తితో రగులు తున్నారని అంటున్నారు.  

నిజానికి..  స్థానిక నాయకులు, కార్యకర్తల్లో  అసంతృప్తి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు, జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో  ఎమ్మెల్యేల వద్ద  తమ బాధను చెప్పుకుంటున్నారని అంటున్నారు.  అయితే,ఇంతవరకు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే కావడంతో..  డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు ఉందని, కార్యకర్తలను సముదాయిస్తూ వచ్చారని అంటున్నారు.

 అయితే..  ఇప్పుడు స్థానిక ఎన్నికలను సవాలుగా తీసుకుని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా  సంప్రదింపులు జరపడంతో  కార్యకర్తలు, నాయకులతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఆమెకు పార్టీ పరిస్థితితో పాటుగా తమ పరిస్థితిని  విపులంగా, వివరంగా చెపుతున్నారని అంటున్నారు. అలాగే..  ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్న సామెతను గుర్తుకు తెచ్చుకుని ఆమె ముందు తమ కోర్కెల చిట్టాను ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే.. నిన్నమొన్నట్లో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి నేతలతో జరిగిన భేటీలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలోలలో భగ్గుమంటున్న అసంతృప్తిని మీనాక్షి నటరాజన్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు అయితే  మీరు చెప్పినట్లుగా  స్థానిక సంస్థలో  ఎన్నికలో కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలంటే, మమ్మల్ని గెలించిన వారికి న్యాయం చేయండి. వారికి  కాంట్రాక్టులు ఇవ్వండి.  పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వండి.. అంటూ మీనాక్షి మేడంకు విన్నవించుకున్నట్లు చెపుతున్నారు. అలాగే.. అదే చేత్తో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని డిమాండ్ టోన్ లో రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. అంతే  కాకుండా మంత్రులు  నిధులు మొత్తం తమ సొంత నియోజకవరగాలకు తరలించుకుకు పోతున్నారనీ, అధికారులు తమ మాట వినడం లేదనీ,  కనీసం ఫోన్  లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించినట్లు సమాచారం. 

ఇలా ఓ వంక అసెంబ్లీ ,లోక సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు పనులు కాక, పదవులు రాక నిరాశగా ఉన్నారు, మరో వంక కులగణన జరిపించిన నేపధ్యంలో.. పదవులు ఆశిస్తున్న బీసీ నేతలలోనూ నిరాశ వ్యక్తమవుతోందని మీనాక్షి నటరాజన్ కు పరిస్థితిని  వివరించినట్లు తెలుస్తోంది. 

నిజానికి ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పదవుల పంపకాల్లో ఆలస్యం కారణంగా నాయకులలో అసంతృప్తి ఉన్న మాట  నిజమే అని  అంగీకరిస్తూనే..  త్వరలోనే అర్హతలను బట్టి పార్టీ పదవులు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు.  మరో వంక, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో పార్టీ పట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు, గౌరవం దక్కుతుందనే భరోసాఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, జిల్లా అధికారులు తమ మాట వినకపోవడం వలన పార్టీ కార్యకర్తలకు సాయం అందించ లేకపోతున్నామని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు విషయం ముఖ్యమంత్రితో చర్చించి చక్కదిద్దడానికి యత్నిస్తానని ఆమె హామీనిచ్చినట్టు తెలిసింది. 

అదలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  కు కాంగ్రెస్ పార్టీలో నాటుకు పోయిన నాకేంటి ..మాకేంటి కల్చర్  అసలు సవాలుగా నిలుస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో, స్థానిక ఎన్నికల టాస్క్ లో  ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడవలసిందే అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu