ఇక రాజధాని అంశంతో రాజకీయాలా?

 

ఇంతవరకు రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆంధ్రాకో లేదా తెలంగాణాకో అనుకూలంగా మాట్లాడినట్లయితే రెండో ప్రాంతంలో ఓట్లు పోతాయని రాజకీయ పార్టీలు భావించేవి. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఇదే సూత్రం వర్తింపజేస్తున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలుని రాజధానిని చేయాలంటూ రెండు రోజులు దీక్షకు కూర్చొన్న ఆయన రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురూ కూడా మిగిలిన జిల్లాలలో ఓట్లు పోతాయనే భయంతోనే రాజధాని విషయం మాట్లాడకుండా దాటవేస్తున్నారని, ఇటువంటి నేతల వలననే రాయలసీమ వెనుకబడిపోయిందని ఆక్షేపించారు.

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజధానిని ఏవిధంగా నిర్మించుకోవాలో తనకు బాగా తెలుసని చెపుతూనే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని ఎన్నికల తరువాత అధికారం చెప్పట్టే కొత్త ప్రభుత్వమే చూసుకొంటుందని చెప్పడం చూస్తే బైరెడ్డి ఆరోపణలు నిజమేనేమోనని నమ్మవలసివస్తోంది.

 

ఇప్పటికే అనేకమంది రాజకీయ నేతలు తమ తమ ప్రాంతాలలోనే రాజధాని నిర్మించాలని స్థానిక ప్రజల, విద్యార్ధుల, మేధావుల, ఉద్యోగుల మద్దతు కూడా గట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇంతవరకు సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలను ఆక్కట్టుకోవాలని ప్రయత్నించిన రాజకీయ నేతలు బహుశః రేపు జరుగబోయే ఎన్నికలలో రాజధాని అంశాన్ని రాజకీయ చేసి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తారేమో.