4,350 దాటిన నేపాల్ మృతులు

 

నేపాల్ లో భూకంపం తాకిడిలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి వీరి సంఖ్య 4,350 కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా తినడానికి ఆహారం, నీరు, మందులు, కరెంటు లేక ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. నేపాల్ ప్రభుత్వ ఉన్నతాధికారి లీలామణిపౌడెల్ విలేకర్లతో మాట్లాడుతూ బాధితులకు కావలసిన పొడిసరుకులు, టెంట్లు, బ్లాంకెట్లు, మందులు, ప్రత్యేక సామాగ్రి, వైద్య బృందాలను పంపిచాల్సిందిగా విదేశాలను కోరుతున్నామని తెలిపారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు సహాయకబృందాలను పంపిచాయి. అయితే సహాయచర్యలకు వర్షం పెద్ద ఆటంకంగా మారింది. విదేశాల నుండి వచ్చిన అత్యాధునిక పరికరాలు, జాగిలాల సహాయంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ ను ఆదుకోవడానికి ఒక నెల వేతనం ఇవ్వాలని ప్రతిపాదన చేయగా లోక్ సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో వారి ఒక నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు నిర్ణయించుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ తన నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు.