రక్త పిశాచికి బెయిల్

 

రక్త పిశాచికి బెయిల్ లభించింది. అవును.. ఆరేళ్ళ క్రితంలో ముంబైలో పేలుళ్ళు జరిపి 166 మంది మృతికి కారణమైన ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఒకపక్క పెషావర్‌లో 141 మంది స్కూలు పిల్లలను తాలిబన్ ఉగ్రవాదుల చేతిలో కోల్పోయిన పాకిస్థాన్, ఒకపక్క లబోదిబో అంటూనే మరోపక్క ఈ ఉగ్రవాదికి బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జైల్లో వున్నాడు. లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల భారతదేశం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే లఖ్వీకి బెయిల్ వచ్చిందని భారతదేశం ఆరోపిస్తోంది. ఇదిలా వుండగా, లఖ్వీకి కోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల పాకిస్థాన్ నాలుక కరచుకున్నట్టు నటిస్తోంది. ఈ పరిణామాన్ని తాను ఊహించలేదని నంగి నాటకాలు ఆడుతోంది. సాంకేతిక లోపం వల్లే నఖ్వీకి బెయిల్ వచ్చిందని అంటోంది. పాకిస్థాన్ అధికార గణమంతా పెషావర్ మారణకాండ గొడవలో తలమునకలై ఉన్నందువల్ల ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో అధికారులుగానీ, లాయర్లు గానీ సరిగా స్పందించలేకపోయారని కుంటి సాకులు చెబుతోంది.