భువనేశ్వరికి కాదు భూదేవీకి అవమానం..
posted on Nov 20, 2021 2:16PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన పరిణామాలు చాలా దారుణమన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సభ్య సమాజం తల దించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లే అన్నారు రఘురామ. యావత్ మహిళలకు జరిగిన అవమానమన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై మహిళా లోకమంతా రోడ్డెక్కి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు రఘురామ రాజు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడకుండా సభను పక్కదారి పట్టించడం సరికాదన్నారు ఎంపీ రఘురామ రాజు. ఏపీ ‘‘మీ ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడితే ఏం చేస్తారు?రోజులన్నీ మీవి కావు.. అది గమనించి నడుచుకోవాలి. నందమూరి కుటుంబం ఎంత ఆవేదన పడిందో చూశాం. ఎన్టీఆర్ జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలి. ఇది ఎన్టీఆర్ కుటుంబ సమస్య కాదు.. తెలుగు వారికి జరిగిన అవమానం. ఈ ఘటనపై ప్రతిఒక్కరూ స్పందించాలి. మహిళలంతా ఏకమై ముందుకు కదలాలి’ అని రఘురామ కృష్ణం రాజు పిలుపునిచ్చారు.