మోదీ సర్కార్ దేశానికి అవసరం లేనివెన్నో చేసింది

 

పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు దేశవ్యాప్త బంద్ చేపట్టాయి.. ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.. 'మోదీ ప్రభుత్వం చాలా పనులు చేసింది కానీ అవేవీ దేశ ప్రయోజనాలను కాపాడేవి కావు.. వాళ్లు అన్ని హద్దులూ అతిక్రమించారు.. ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గరపడింది.. రైతుల నుంచి చిన్న వ్యాపారాల వరకూ అందరూ అసంతృప్తితో ఉన్నారు.. యువత ఉద్యోగాలు లేక ఆందోళనలో ఉంది' అని మన్మోహన్ విరుచుకుపడ్డారు.. దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండటంతో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.. 'ఇక ప్రభుత్వాన్ని మార్చే సమయం తొందర్లోనే వస్తుంది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలి.. ఏకతాటిపై నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి’ అని మన్మోహన్‌ పిలుపునిచ్చారు.