బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత
posted on Jul 3, 2025 2:39PM
.webp)
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ముందడుగు వేయలేదని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని తెలిపారు.
బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు.