జగన్ కంఠశోష.. వైసీపీ నేతలకు శిరోభారం!
posted on Sep 27, 2023 4:13PM
జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సందర్భంలో ప్రసంగించినా ఆయన స్టైల్ ఒక్కటే.. ఆయనకు తెలిసిందీ ఒక్కటే.. అదే ఆత్మస్థుతి, పరనింద. తన భుజాలను తానే చరుచుకోవడం, ప్రత్యర్థులపై విరుచుకుపడటం. మరో సారి కూడా జగన్ మోహన్ రెడ్డి అదే చేశారు. ఆయనకు తీరిక దొరికినా, ఏమీ తోచకపోయినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజవకర్గ ఇన్ చార్జీలతో సమావేశమౌతారు. అలాగే మంగళవారం (సెప్టెంబర్ 26) కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ చార్జీలతో భేటీ అయ్యారు.
గత భేటీలకూ, ఈ భేటీలకూ పెద్ద తేడా ఏమీ లేదు. గత భేటీలలో ఏం చేప్పారో.. ఈ సారి అదే చెప్పారు. అయితే రాష్ట్రంలో తన పాలనపై తీవ్రంగా వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగా ఆయన మాటల్లో ధీమా తగ్గింది. స్వరంలో వాడి లేదు. పని తీరు మార్చుకోవాలన్న హెచ్చరికలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరంతా నా వాళ్లు. మిమ్మల్ని నేను వదులు కోను అంటూ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, ఎమ్మెల్సీల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేశారు. అయితే గత సమావేశాలలో జగన్ టోన్ ఇలా లేదు. హెచ్చరికలు, పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇవ్వనంటూ ఆగ్రహం కనిపించాయి. అయితే ఈ సారి టోన్ పూర్తిగా మారిపోయింది. సిట్టింగులందరికీ టికెట్లిచ్చే పరిస్థితి లేదు అని చెబుతూనే టికెట్ దక్కని వారు కూడా తనవారేననీ, వారికి తప్పని సరిగా ఏదో ఒక పదవి ఇస్తానంటూ బుజ్జగింపు ప్రయత్నాలే జరిగాయి.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆ వ్యతిరేకత పీక్స్ కు చేరింది. అంతే కాకుండా వైసీపీ నేతలు, శ్రేణులలో కూడా జగన్ తప్పు చేశారని, చంద్రబాబుది అక్రమ అరెస్టుననీ, దీని వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిందన్న అభిప్రాయమే వ్యక్తం అవుతున్నది. అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు, శ్రేణులూ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు కూడా. ఈ విషయాలన్నీ గ్రహించే జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. నష్ట నివారణ చర్యలలో భాగంగా చాలా సౌమ్యమైన స్వరంతో ప్రసంగించారు. జనంలో వచ్చిన వ్యతిరేకతను ఎటూ తగ్గించలేం. కనీసం పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉన్న భయాలు, ఆందోళనను అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఈ భేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే సముదాయించడం, భయాలను, ఆందోళనలను తొలగించడం మాట అటుంచి జగన్ వారికి చెప్పింది ఆవు కథ మాత్రమే.
గతంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాలలో చెప్పిన విషయాన్నే అక్షరం పొల్లుపోకుండా జగన్ మళ్లీ వల్లె వేశారు. ఇక్కడ కొత్తగా ఆయన చేసిన ప్రతిపాదన ఏమిటంటే జగనన్న సురక్ష, వై జగన్ నీడ్ ఏపీ కార్యక్రమాలు నిర్వహించాలన్నది మాత్రమే. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని ఓ రేంజ్ లో ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, నాయకులు మరోసారి పేరేదైనా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లేందకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత పలువురు ఇదే అభిప్రాయాన్ని ఒకింత బాధతో, ఒకింత నిర్లిప్తతతో ఒకరికొకరు చెప్పుకున్నారు.
బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడమే పాలన అనుకునే నాయకుడికి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న నాయకుల బాధలు ఎలా తెలుస్తాయని అంటున్నారు. రోడుకు ఇరువైపులా పరదాలు కట్టుకుని జనాగ్రహం కంట పడకుండా నేరుగా వేదికపైకి వచ్చి బటన్ నొక్కేసి డబ్బులు పంచేశానని ప్రకటించి.. జనం వింటున్నారా, సభ నుంచి పారిపోతున్నారా అన్నది పట్టించుకోకుండా ప్రసంగించేసి వెళ్లిపోయే జగన్ కు పార్టీ నేతల ఇబ్బందులు ఎలా తెలుస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జగన్ తో భేటీలో మరోసారి ఆవుకథ విన్నామంతే.. అంతకు మించి జరిగిందేమీ లేదని పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు.