రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు - కేటీఆర్ సంచన వ్యాఖ్యలు 

దుబ్బాక ఉప ఎన్నిక , విపక్షాల ఆరోపణలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదన్నారు కేటీఆర్. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ ఇప్పుడు  కాంగ్రెస్ లో ఉన్నారని... త్వరలోనే బీజేపీలోకి వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీ మారుతారని చెప్పారు కేటీఆర్. దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చని మంత్రి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది కాబట్టే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తోందన్నారు కేటీఆర్.

 

సిద్ధిపేటలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా స్పందించారు కేటీఆర్. సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... లేనిది ఉన్నట్టు చెప్పడం బీజేపీ నేతల అలవాటని కేటీఆర్ విమర్శించారు. తాము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నామని... తమ ఓపిక నశిస్తే ప్రధాని మోడీని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మాట్లాడటం తమకు కూడా వచ్చని అన్నారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు కేటీఆర్.

 

మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ కు ఇంత వరకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకు 27 వేల కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. బీజేపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకంటే వారికే మంచిదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై ఇంతవరకు మాట్లాడని కేటీఆర్.. పోలింగ్ కు ఐదు రోజుల ముందు హాట్ కాెమెంట్స్  చేయడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండటం వల్లే కేటీఆర్ స్పందించారనే ప్రచారం జరుగుతోంది.