స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పై మరో సారి ఉత్కంఠ నెలకొంది. కరోనా కారణంగా మొన్న మార్చిలో నిలిచిపోయిన ఎన్నికలను మళ్ళీ ఎపుడు నిర్బహించాలనే విషయంపై ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో పక్క స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

 

తాజాగా రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి ఈ అంశం పై  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన అన్నారు. డిసెంబర్‌లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారని.. అలాగే ఏ వైరస్ అయినా రెండు, మూడు సార్లు వస్తుందని అయన తెలిపారు. నవంబర్, డిసెంబర్ పరిస్థితిని చూసి అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని అయన తెలిపారు. అప్పటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన వెల్లడించారు. బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని, అందువల్ల వాటి నిర్వహణ తప్పనిసరి అని.. ఐతే రాష్ట్రంలో జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వీటికి కొంత వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. అసలు రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కూడా అయన అన్నారు.

 

ఇది ఇలా ఉండగా గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించుకుందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్‌ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరో పక్క రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్ మెంట్ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.