కోల్‌కతా ర్యాలీ సక్సెస్.. త్వరలో అమరావతిలో ప్లాన్!!

 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న కోల్‌కతాలో ఐక్యతా ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ గురించి ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. అంతేకాదు కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ వంటిది త్వరలో అమరావతిలో కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఆదివారం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ నిన్న కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని అన్నారు. త్వరలో అమరావతిలో కూడా ర్యాలీ జరగనున్నట్లు తెలిపారు. 

బీజేపీ వ్యతిరేకపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. మరి కోల్‌కతా ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో జగన్‌ చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. దేశాన్ని పరిరక్షించే ఫ్రంట్‌ ఒకవైపు ఉంటే.. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఫిడేల్‌ ఫ్రంట్‌ మరోవైపు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో చేతులు కలిపి ఏపీ రైతులకు జగన్‌ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు అడ్డగోలుగా నిర్మిస్తోందని ఆరోపించారు. పులివెందులకు కూడా చంద్రబాబు సాగునీరు ఇచ్చారని అన్నారు. డబ్బు మూటల కోసమే కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారని దేవినేని ఉమా విమర్శించారు.