రూ.2400 కోట్లు.. ఇద్దరు టెకీలకు మెటా మెగా ఆఫర్
posted on Jul 18, 2025 9:39AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల కోతకు కారణమౌతుందంటూ ఒక వైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరో వైపు ప్రతిభావంతుల కోసం టెక్ దిగ్జజాలు కాగడా పెట్టి గాలిస్తున్నాయి. అలా ప్రతిభావంతులకు అనూహ్య స్ధాయి వేతనాలతో కొలువులోకి తీసుకుంటున్నాయి. ఒక వైపు మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలోనే.. ప్రతిభ ఉంటే కొలువులు వెతుక్కుంటూ కాళ్ల దగ్గరకు వస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా ఇద్దరు ఏఐ ఇంజినీర్లను గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వేతనాల ఆఫర్ చేసి మరీ కొలువులోకి తీసుకుంది. ట్రాపిట్ బన్సల్ , రూమింగ్ పాంగ్ అనే ఇద్దరు ఏఐ ఇంజనీర్లు మెటాలో రికార్డు స్థాయి వేతనాలతో ఉద్యోగులుగా చేరారు.
ఈ ఇరువురూ కూడా భారత సంతతికి చెందిన టెక్ నిపుణులే కావడం విశేషం. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగంలో పని చేసేందుకు భారత సంతతికి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఉద్యోగాలిచ్చింది. వీరిలో ట్రాపిట్ బన్సల్‌కు ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో మెటాలో చేరారు. అలాగే రూమింగ్ పాంగ్ అనే మరో ఏఐ నిపుణుడిని అయితే రూ.1600 కోట్ల రూపాయల వేతనంతో కొలువులోకి తీసుకుంది. అంటే ఇద్దరు ఐటీ నిపుణులకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించింది.
భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్, ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి . 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో లక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓపెన్ఏఐలో ‘O1’ అనే రీజనింగ్ మోడల్ డెవలప్‌మెంట్‌లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక రూమింగ్ పాంగ్ అయితే యాపిల్ కంపెనీ నుంచి వచ్చి మోటాలో చేరారు. యాపిల్ లో అత్యాధునిక ఏఐ సిస్టమ్‌ల డెవలప్ మెంట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు.