అత్యాచారాన్ని ప్రతిఘటిస్తే ప్రాణాలే తీసేశారు

 

మేఘాలయలో మిలిటెంట్లు సాగించిన కీచకపర్వంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక గిరిజన మహిళ(35)ను మిలిటెంట్లు అతి దారుణంగా చంపేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్పులు జరపడంతో ఆమె తల రెండు ముక్కలైంది. గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(జీఎన్‌ఎల్‌ఏ)కు చెందిన తీవ్రవాదులు మంగళవారం సాయంత్రం సౌత్ గరో జిల్లాలోని రాజా రోంగత్ గ్రామంలోకి వచ్చి, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నెపంతో ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చారు. అందరిముందు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో తీవ్రవాదులు ఆమె నుదురుపై తుపాకీ పెట్టి తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆమెకి భర్త, ఐదుగురు పిల్లలు వున్నారు వారిని ఇంట్లో బంధించి ఇంటి ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని స్థానిక ఎంపీ పీఏ సంగ్మా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రప్రభుత్వం ఆ మహిళ కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దోషులను గుర్తించి, కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించానని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ప్రజల తరఫున పోరాడుతున్నామని చెబుతున్న మిలిటెంట్ సంస్థ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దారుణమని మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న జీఎన్‌ఎల్‌ఏను కేంద్రప్రభుత్వం 2012లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే, ఆ మహిళపై తమ సభ్యులు అత్యాచారయత్నం చేశారన్నది అవాస్తవమని, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే ఆమెకు శిక్ష విధించామని జీఎన్‌ఎల్‌ఏ ప్రకటించింది. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం 1,000 మంది పారా మిలటరీ బలగాలను మేఘాలయకు పంపింది.