సీఎం జ‌గ‌న్‌కు మావోయిస్టుల వార్నింగ్‌.. వైసీపీలో హైటెన్ష‌న్‌..

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయిందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. తనపై ఉన్న కేసుల కోసమే మోడీ సర్కార్ కు జగన్ గులాం గురి చేస్తున్నారని మావోయిస్టు నేత, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ ఆయన మీడియాకు లేఖ పంపారు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టేశారని  లేఖలో గణేశ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ... అప్పటి టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీకి సాగిలపడిందని ఆరోపణలు చేసిందని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం.. వారిని పక్కదారి పట్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు.

కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు గొంతెత్తితే రాజద్రోహం కేసులుపెట్టి జైళ్లలో నిర్బంధిస్తోందని అన్నారు. జగన్ దీనికి మద్దతు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విమర్శిస్తున్న మీడియాను సైతం జగన్ వదిలిపెట్టకుండా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ‘నవరత్నాలు పథకాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించి, ఉపాధిని కల్పించి అభివృద్ధి చేయలేవు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో కార్పొరేట్‌ సంస్థలకు లాభాలను చేకూర్చడమే గానీ, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడం కాదు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేయాలని యత్నిస్తుంటే దానికి జగన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపి, పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ కార్మికులను మోసం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గ్రామ వాలంటీర్లది సేవ అంటూనే రాజకీయ అవసరాలకు, పోలీసు ఏజెంట్లుగా పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవస్థ సైతం అవినీతిమయంగా మారుతోంది అని లేఖలో గణేష్ ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవో-97 రద్దు చేసినప్పటికీ, అన్‌రాక్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేదని గణేశ్‌ తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక బలగాలను దింపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పుతున్న మేధావులు, రచయితలపైనా ‘ఉపా’ కేసులు ప్రయోగించి జైళ్లలో బంధిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలపైనా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఆఖరికి తనను విమర్శిస్తున్న మీడియాను సైతం వదిలి పెట్టకుండా కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను మరుగునపరచి.. తన సొంత మీడియా, పార్టీ శ్రేణుల ద్వారా తన ప్రభుత్వం గొప్ప విజయాలు సాధించిందని భూమి దద్దరిల్లేలాగా జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు అందరూ ముందుకురావాలని గణేశ్‌ ఆ లేఖలో పిలుపిచ్చారు.