కమలం గూటికి మంచు లక్ష్మి?!

నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది. వారి రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో పార్టీ గూటికి చేరుతున్నారా? అసలింతకీ మోహన్ బాబు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు. అన్న సందేహాలు ఆయన అభిమానుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు క్రియాశీలంగా లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు.

గత నాలుగున్నరేళ్లుగా పార్టీలో మోహన్ బాబుకు ఎటువంటి గుర్తింపూ లేదన్న అసంతృప్తి ఆయనలో బలంగా ఉందని అంటున్నారు. అలీ, పోసాని కృష్ణ మురళి వంటి వారికి కూడా ఏవో పదవులు ఇచ్చిన జగన్ తనను పట్టించుకోకపోవడంపై మోహన్ బాబు ఒకింత ఆగ్రహంగా కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆ మధ్య ఒక సారి కుమార్తెతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాంతో అప్పట్లో ఆయన తెలుగుదేశం గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే మోహన్ బాబు స్వయంగా అటువంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు.

ఆ తరువాత మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీకి చెందిన బూమా మౌనికను వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఇక మరో కుమారుడు మంచు విష్ణు.. భార్య వైసీపీ అధినేత, సీఎం జగన్  బంధువు. దీంతో మోహన్ బాబు కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు. మంచు లక్ష్మికి పీఎంఓ నుంచి కాల్ వచ్చిందనీ, దీంతో ఆమె శుక్రవారం (సెప్టెంబర్ 21) హస్తిన బయలుదేరుతున్నారనీ చెబుతున్నారు.

ఒక వేళ మంచు లక్ష్మా కాషాయ కండువా కప్పుకుని కమలం మోహన్ బాబు విష్ణులు వైసీపీలోనూ, మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలోనూ, మంచు లక్ష్మి బీజేపీలోనూ ఇలా ఒకే కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు అవుతుంది. అయితే మంచు విష్ణు కమలం తీర్థం పుచ్చుకుంటున్నారన్న విషయంపై అటు బీజేపీ కానీ, ఇటు మంచు ఫ్యామిలీ కానీ కన్ఫర్మ చేయలేదు.