జగన్నాటకం.. మాధవ్ వీడియోపై పొంతన లేని మాటలు.. విచారణ లేకుండానే క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం

గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో వైసీపీలో తడబాటు స్పష్టంగా కనబడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ ఈ
దిక్కుమాలిన వీడియో విషయంలో మాధవ్ ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఈ విషయంలో
గోరంట్ల మాధవ్ ను వెనకేసుకు రావడానికి ఆ పార్టీ గంటకో మాట, పూటకో కారణం చూపుతున్నారు.

వీడియో బయటపడిన
రోజు గోరంట్ల మాధవ్  మీడియా ముందుకు వచ్చి సదరు వీడియో మార్ఫింగ్ అని చెబుతూ ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు
చేశానని చెప్పారు. దానినే పట్టుకుని మాధవ్ ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ పూర్తయిన తరువాత మాధవ్ తప్పు చేసినట్లు తేలితే.. అంటే ఆ వీడియోలో ఉన్నది మాధవే అని రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అంటే సజ్జల మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని కమిట్ అయ్యారు. ఆ తరువాత ఓ రెండు రోజుల పాటు వైసీపీలో ఎవరూ ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అటు గోరంట్ల మాధవ్ కూడా నోరు మెదప లేదు.  

కానీ మీడియాలో, సామాజిక మాధ్యమంలో సామాన్య జనంలో కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత నుంచి ఈ వీడియో సెంట్రిక్ గా కుల చిచ్చు పెట్టడం నుంచి అన్ని విధాలుగా ఎంపీని కాపాడడానికే ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ నుంచి ప్రతి ఒక్కరూ పొంతన లేని మాటలు మాట్లాడారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మాధవ్ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. ఆ మరుసటి రోజే హిందూపురంఎస్పీ ఫకీరప్ప ఎంపీ గోరంట్ల మాధవ్, హోమంత్రి చెప్పిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలని తేల్చేశారు. మాధవ్ తమకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.

ఆయన అభిమాని ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. అలాగే ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదనీ చెప్పాశారు. దీంతో ప్రజలకు అసలు ఎవరు చెబుతున్నది నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ వీడియోను ఇంకా ఫోరెన్సిక్‌కు పంపలేదని.. సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ కు పంపలేమనీ, ఒరిజనల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ కు పంపగలమనీ అన్నారు. అసలా వీడియోలో ఉన్నది మాధవా కాదా అన్నది కూడా చెప్పలేమని వివరణ కూడా ఇచ్చారు. అంటే ఒరిజనల్ దొరకదు, మేం దర్యాప్తు చేసినా ఏం తేలదు..ఇక ఈ కేసు కంచికి వెళ్లినట్లే అని చెప్పకనే చెప్పేశారు.

ఇలా ఫకీరప్ప విలేకరుల సమావేశం పూర్తయ్యిందో లేదో అలా ఎంపీ మాధవ్ మీడియా ముందుకు వచ్చి... తాను నిర్దోషినని తనకు తానే ప్రకటించేసుకుని యథా ప్రకారం బూతు పురాణం విప్పేశారు. అసభ్యతకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చిన ఎంపీని కాపాడేందుకు జగన్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. చివరకు ఇక ఆ విషయంలో పార్టీ పరంగా తీసుకునే చర్యలేమీ ఉండవని చేతులు దులిపేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో సజ్జల, హోంమంత్రి మీడియా సాక్షిగా చెప్పిన అబద్ధాలు, ఎంపీని కాపాడేందుకు పడిన తాపత్రయం మాత్రం జనానికి స్పష్టంగా అర్ధమైపోయిందని విమర్శకులు అంటున్నారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారు ఏ ఛండాలం చేసినా కాపాడేందుకు పార్టీ, ప్రభుత్వం సదా తయారుగా ఉంటాయని ఈ ఎపిసోడ్ ద్వారా తేటతెల్లమైందని విశ్లేషకులు అంటున్నారు.