తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్

 

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫలితాల్లో తప్పులకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలని, బాధ్యులపై సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేయాలని, చనిపోయిన 16 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్‌ కోరారు. ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరిన్ టెక్నాలజీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టి సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పిటిషనర్‌ చేర్చారు.

మరోవైపు.. ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్‌బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు.